suspended | నిర్లక్ష్యం చేసినందుకేనా…!
suspended | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన కల్తీపాల ఘటనలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈనెల 15న పాల వ్యాపారి గణేశ్వరరావు పాలు పోసిన 110 ఇళ్లకు సంబంధించి 315 మంది రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా… వారిలో మరో ఇద్దరు కిడ్నీవ్యాధుల భారిన పడినట్లుగా వైద్య పరీక్షల్లో గుర్తించారు. కల్తీ పాలు తాగిన వారిలో ఆరేళ్ల బాలుడు కూడా చనిపోవడంతో ఇప్పటివరకు అధికారులు ప్రకటించిన మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది.
బ్యాక్టీరియల్ పరీక్షల కోసం ల్యాబ్ లకు పంపిన శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. కల్తీ పాలకు కారణమైన వ్యాపారి గణేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు కల్తీ పాల బాధితులకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంపై విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణపై ప్రభుత్వం వేటు వేసింది.
కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. విశాఖ నుంచి సీనియర్ నేఫ్రాలజిస్ట్ డా.రవి రాజ్ బృందం సైతం వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులకు చెన్నై, ముంబై నుంచి కూడా మెడిసిన్స్ తీసుకొస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
