గ్రామకంఠ భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్…
గ్రామకంఠ భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్…
రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో వేలాది కుటుంబాలకు ఊరట.
కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామాల్లో దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లపై నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ ప్రభుత్వం జి.ఓ ఎంఎస్ నం.297ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో కర్నూలు జిల్లాలో వేల ఎకరాల గ్రామకంఠ భూములు రిజిస్ట్రేషన్ పరిధిలోకి రానుండగా, లక్షలాది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. కర్నూలు జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పాతకాలం నుంచి నివసిస్తున్న కుటుంబాలు గ్రామకంఠ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు.
అయితే రెవెన్యూ రికార్డుల్లో స్పష్టమైన నమోదు లేకపోవడం, కొన్ని సర్వే నంబర్లు 22-ఏ నిషేధిత జాబితాలో కొనసాగడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొనుగోలు, అమ్మకాలు, వారసత్వ బదిలీలు జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమస్యలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో గ్రామకంఠంగా నమోదైన భూములపై రిజిస్ట్రేషన్‌ను అడ్డుకోవద్దని రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా, ఇంటి పన్ను రసీదు లేదా వారసత్వ స్వీయ ప్రకటన ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
జిల్లాలో 25వేల ఎకరాలో గ్రామ కంటే భూములు
కర్నూలు జిల్లాలో గ్రామకంఠ భూములు భారీ స్థాయిలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 18 వేల నుంచి 25 వేల ఎకరాల వరకు గ్రామకంఠ భూములు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, ఆలూరు, కోడుమూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో ఈ భూములు అధికంగా ఉన్నాయి. గ్రామాల్లో తరతరాలుగా నివసిస్తున్న కుటుంబాలకు భూములపై పూర్తి హక్కులు సాధించేందుకు ఈ ఉత్తర్వులు కీలకంగా మారనున్నాయి.
ఈ జి.ఓ ద్వారా కర్నూలు జిల్లాలోనే సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, వారసత్వంగా ఇళ్ల స్థలాలు పొందిన కుటుంబాలు, పాత ఇళ్ల యజమానులు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం:
గ్రామకంఠ సర్వే నంబర్ అయితే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వాలి. లింక్ డాక్యుమెంట్ ఉన్నా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి.పాత ఇల్లు ఉండి పన్ను రసీదు ఉంటే రిజిస్ట్రేషన్ అనుమతించాలి. గ్రామీణ ప్రాంతాల్లో లింక్ డాక్యుమెంట్ లేకున్నా స్వీయ ప్రకటన ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
రిజిస్ట్రేషన్ ద్వారా యాజమాన్య హక్కు..
అయితే రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా యాజమాన్య హక్కు పూర్తిగా నిర్ధారణ కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూమి యాజమాన్యానికి సంబంధించిన బాధ్యత పూర్తిగా పత్రాల సమర్పకులదేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. తప్పుడు సమాచారం ఇస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో స్థిరాస్తి లావాదేవీలు వేగం..
ఈ నిర్ణయంతో గ్రామీణ స్థిరాస్తి లావాదేవీలు వేగంగా కొనసాగే అవకాశం ఉంది. మరింత పుంజుకునే అవకాశం లేకపోలేదు.రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఈ ఉత్తర్వులు పెద్ద ఊరటనిస్తున్నాయి.
