వసతులు మెరుగైనా హాస్టళ్లలో ఖాళీలే అధికం

వసతులు మెరుగైనా హాస్టళ్లలో ఖాళీలే అధికం

  • వసతి గృహాల్లో ఉండేందుకు విద్యార్థులు వెనుకంజ

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రభుత్వ హాస్టళ్లలో వసతులు గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించడంతో హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కొంతమేర అభివృద్ధి చెందాయి. అయినప్పటికీ విద్యార్థుల చేరికలు ఆశించిన స్థాయిలో లేకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

పెద్దపల్లి మండల పరిధిలో మొత్తం తొమ్మిది హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఐదు హాస్టళ్లకు ప్రభుత్వ పక్కా భవనాలు ఉండగా, నాలుగు ప్రీ-మెట్రిక్ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రీ-మెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థుల చేరికలు తక్కువగా ఉండటంతో గణనీయమైన ఖాళీలు కనిపిస్తున్నాయి. హాస్టళ్లలో వార్డెన్లు, ఇతర సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ, విద్యార్థులను ఆకర్షించడంలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రీ-మెట్రిక్ హాస్టళ్లకు శాశ్వత భవనాల నిర్మాణం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సుల్తానాబాద్‌లో పరిస్థితి

సుల్తానాబాద్ మండల కేంద్రంలో మూడు హాస్టళ్లు కొనసాగుతున్నాయి. విశాలమైన భవనాలు, ప్రహరీ గోడలతో వసతులు అందుబాటులో ఉన్నాయి. ఎస్సీ బాలికల హాస్టల్‌లో 100 సీట్లకు గాను ప్రస్తుతం 40 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు. అడ్మిషన్లు కొనసాగుతున్నప్పటికీ పాత భవనం కారణంగా 60 నుంచి 70 మంది వరకు మాత్రమే చేర్చే అవకాశం ఉందని వార్డెన్ మాధవి తెలిపారు.

దుబ్బులపల్లి అశోక్‌నగర్‌లో ఉన్న ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహంలో 100 సీట్లకు గాను 68 మంది విద్యార్థులు చేరారు. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఇక్కడ వసతి పొందుతున్నారు. అలాగే బీసీ బాలుర ప్రీ-మెట్రిక్ హాస్టల్‌లో 100 సీట్లకు గాను కేవలం 40 మంది మాత్రమే ఉండగా, 60 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఓదెల మండలంలో ఖాళీలు

ఓదెల మోడల్ స్కూల్‌లో 500 సీట్లకు గాను 270 మంది విద్యార్థులు చేరగా, 230 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మోడల్ కాలేజీలో 260 సీట్లకు గాను కేవలం 145 మంది మాత్రమే చేరి, 115 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కేజీబీవీలో 200 సీట్లు పూర్తిగా భర్తీ కాగా, ఇంటర్మీడియట్ విభాగంలో 160 సీట్లకు గాను 89 మాత్రమే భర్తీ అయ్యాయి. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక అకాడమిక్ బ్లాక్ అవసరమని అధికారులు పేర్కొంటున్నారు.

కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లిలోనూ ఇదే పరిస్థితి

కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మోడల్ స్కూల్‌లో అన్ని సీట్లు భర్తీ కాగా, కేజీబీవీలో 360 సీట్లకు 340 భర్తీ అయ్యాయి. అయితే ఇంటర్మీడియట్ హాస్టల్‌లో తాగునీటి సమస్య విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎస్సీ హాస్టల్‌లో 100 సీట్లకు గాను కేవలం 34 మాత్రమే భర్తీ కావడంతో 66 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

జూలపల్లి మండలంలోని బీసీ వసతి గృహంలో 100 సీట్లకు గాను 30 మంది మాత్రమే చేరారు. కేజీబీవీలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 360 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.

మొత్తంగా చూస్తే హాస్టళ్లలో వసతులు మెరుగుపడుతున్నప్పటికీ, విద్యార్థుల చేరికలు ఆశించిన స్థాయిలో లేవు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, శాశ్వత భవనాల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.