ఆందోళన వద్దు..

ఆందోళన వద్దు..

ఎస్ఐఆర్‌తో ప్రజాస్వామ్య బలోపేతం

అర్హులైన ప్రతి ఓటరు నమోదు కావాలి
సామాజిక కార్యకర్త చిక్కు రాహుల్

సంగారెడ్డి ప్రతినిధి (ఆంధ్రప్రభ): భారత ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే రాజ్యాంగబద్ధమైన చర్య అని రాజకీయ విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త చిక్కు రాహుల్ అన్నారు. ఓటరు జాబితా సవరణపై ప్రజలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరణించిన వారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్ల పేర్లను మాత్రమే తొలగించే ప్రక్రియ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఓటరు జాబితాల తయారీ, సవరణలపై ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం ఉందని చెప్పారు. స్వచ్ఛమైన, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 326లో పొందుపరిచిన వయోజన ఓటు హక్కు సూత్రాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

25 ఏళ్ల తర్వాత సమగ్ర ఓటరు జాబితా సవరణ
తెలంగాణలో దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టడం స్వాగతించదగ్గ పరిణామమని రాహుల్ అన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి తిరిగి సేకరిస్తారని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల కానుందని వివరించారు. ఈ ప్రక్రియలో నకిలీ ఓటర్లు, మరణించిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను తొలగించడంతో పాటు, 18 సంవత్సరాలు నిండిన అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ఓటర్ల వ్యక్తిగత వివరాలను కూడా నవీకరించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేరు, చిరునామా తదితర వివరాలను సరిచూసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించడంతో పాటు, అర్హులైన ఒక్క ఓటరు కూడా పొరపాటున జాబితా నుంచి తొలగించబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అభ్యంతరాల పరిష్కారానికి సులభమైన, వేగవంతమైన వ్యవస్థను అందుబాటులో ఉంచాలని, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, యువత ప్రజల్లో అవగాహన కల్పించి ఎన్నికల కమిషన్‌కు సహకరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వలస కార్మికులు, పేదలు, మహిళలు, వృద్ధులు ఈ ప్రక్రియలో వెనుకబడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిపూర్ణమైన ఓటరు జాబితా నిజమైన ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తుందని, పారదర్శక ఎన్నికలు, జవాబుదారీతనం గల పాలన, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది దోహదపడుతుందని చిక్కు రాహుల్ పేర్కొన్నారు.