Stephen Fleming CSK | దిగ్గజ కోచ్‌కు భావోద్వేగ వీడ్కోలు
Stephen Fleming CSK | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరైన స్టీఫెన్ ఫ్లెమింగ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారంతో ఫ్లెమింగ్, సీఎస్‌కే విడిపోతున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
దాదాపు 17 ఏళ్ల పాటు సీఎస్‌కే ప్రధాన కోచ్‌గా కొనసాగిన ఫ్లెమింగ్ నాయకత్వంలో జట్టు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన, స్థిరమైన ఫ్రాంచైజీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆయన శిక్షణలో చెన్నై సూపర్ కింగ్స్ పలు ఐపీఎల్ టైటిళ్లను సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకుని ప్రత్యేక ముద్ర వేసింది.
ఫ్లెమింగ్ సేవలను గుర్తు చేసుకుంటూ సీఎస్‌కే సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది. “మా మధ్య ఉన్న ఈ అద్భుతమైన భాగస్వామ్యం ఐపీఎల్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. మీ వారసత్వం ఎప్పటికీ మాకు స్ఫూర్తిగా ఉంటుంది. ధన్యవాదాలు స్టీఫెన్” అంటూ ఫ్రాంచైజీ నివాళి అర్పించింది. ఫ్లెమింగ్ నిష్క్రమణతో సీఎస్‌కే తదుపరి ప్రధాన కోచ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
