ఓటరు జాబితాల ప్రక్షాళనలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి:

ఓటరు జాబితాల ప్రక్షాళనలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి:

అక్కమ్మతోట రామకృష్ణ

కోడుమూరు, ఆంధ్రప్రభ : ఓటరు జాబితాల ప్రక్షాళన ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ పిలుపునిచ్చారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఆదివారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ బీఎల్‌ఏ-1 మురళీ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గీత మాధురి, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్‌ఏలు) సమర్థవంతంగా వినియోగించుకుని ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాల్లో ఉన్న లోపాలను గుర్తించి సరిచేయడం, మరణించిన ఓటర్ల పేర్లను తొలగించడం, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత పేర్లను నమోదు చేయించడం వంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చేపట్టాలని కోరారు.

ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తుందని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించే బాధ్యత రాజకీయ పార్టీలతో పాటు కార్యకర్తలపైనా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ఓటరు జాబితాల పరిశీలనలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

నియోజకవర్గంలోని ప్రతి బూత్‌లో ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన చేపట్టి ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, పదాధికారులు, మండల నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply