ప్రతి కార్యకర్త అధినేతె..
ప్రతి కార్యకర్త అధినేతె..
కార్యకర్తల సమ్మేళనమే టిడిపి పార్టీ జీవనం..
తెలుగుదేశం పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా..
జిల్లా వ్యాప్తంగా 44 వసంతాల టిడిపి దినోత్సవ వేడుకలు ఘనంగా..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా 1982 సంవత్సరం మార్చి 29వ తేదీన టిడిపి పార్టీ ఆవిర్భావానికి దొంగతనేత మాజీ ముఖ్యమంత్రి టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పార్టీని స్థాపించారు. 44వ వసంత వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల జిల్లాలో ఏడు నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు పరిధిలో ప్రతి గ్రామంలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడేలా చేశారు.
పార్టీ ఆవిర్భావ స్పూర్తిని గర్వంగా ప్రతిబింబిద్దాం అనే నినాదంతో జిల్లాలోని పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి ఆధ్వర్యంలోనూ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ఆధ్వర్యంలో నందికొట్కూరు ఆళ్లగడ్డ డోను పాణ్యం శ్రీశైలం శాసనసభ్యులైన భూమా అఖిలప్రియ బుడ్డ రాజశేఖర్ రెడ్డి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గౌరు చరితారెడ్డి గిత్త జయ సూర్య నంద్యాల టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి ఫిరోజ్, ఏన్ ఎండి ఫయాజ్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, సీనియర్ టిడిపి నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ల ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన పండుగ వాతావరణం నెలకొల్పారు.

గ్రామాలు, పట్టణాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో టిడిపి నాయకులు ర్యాలీలు చేపట్టారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లోని నందమూరి తారక రామారావు విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు మార్చి 29, 1982న స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటితో 44 వసంతాలు పూర్తి చేసుకుంది. భారతదేశంలో అత్యధిక కార్యకర్తలతో నిలిచిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు.

వారు మాట్లాడుతూ, తెలుగువారి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని పొందుతూ అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీ గొప్పతనమని చెప్పారు. అలాగే, తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలు ఢిల్లీ పాలకుల అహంకారాన్ని సైతం తగ్గించేలా ప్రజల తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకం వల్లే నేటికీ ఇది బలమైన ప్రాంతీయ పార్టీగా కొనసాగుతోందని అన్నారు.
కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని, కార్యకర్తలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వారి కుటుంబాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ ఇదేనని వివరించారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీని విజయవంతంగా నడిపిస్తున్నారని కొనియాడారు. యువతకు దిక్సూచిగా నిలుస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్న నారా లోకేష్ కృషిని కూడా అభినందించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా పలు కీలక కార్యక్రమాలు చేపడుతూ, పరిశ్రమలు, పెట్టుబడులు, సంక్షేమ పథకాలు, సమయానికి జీతాలు వంటి అంశాల్లో ప్రజలకు నమ్మకాన్ని కల్పిస్తోందని తెలిపారు.
ఇటీవల అసెంబ్లీలో అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయడం ద్వారా రాష్ట్రానికి స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చిందని, దీనివల్ల ప్రజలు, పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని అన్నారు.
చివరిగా, తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
