పోలీస్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యం

పోలీస్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యం

  • సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్బార్
  • విధుల్లో నిర్లక్ష్యం వద్దు.. సమన్వయంతో పనిచేద్దాం..
  • పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

గోదావరిఖని, ఆంధ్రప్రభ : పోలీస్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యమని, వారి సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్బార్ కార్యక్రమమని, ప్రతి శనివారం కమిషనరేట్లో పోలీస్ సిబ్బందిని కలుస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం రామగుండం కమిషనరేట్ ఏఆర్ సిబ్బంది, అధికారుల కోసం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు కమిషనరేట్ హెడ్క్వార్టర్స్ పోలీస్ దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ హాజరై ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి వృత్తిపరమైన అనుభవాలు, సమస్యలు, వినతులను ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఏ దైనా సమస్యను దర్బార్లో చెప్పేందుకు ఇబ్బందిగా అనిపిస్తే కార్యాలయానికి వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చని సూచించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, మనమందరం ఒక కుటుంబమని, సమన్వయంతో, క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించడం ద్వారా కమిషనరేట్క, తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో, మంచి ప్రవర్తనతో విధులు నిర్వర్తించినప్పుడు అధికారులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. సిబ్బంది చేయాల్సిన విధులు, చేయకూడని పనుల గురించి సూచనలు చేశారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి విధుల్లో నిర్లక్ష్యం వహించినా, పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలీస్ శాఖ, యూనిఫామ్పై గౌరవం ఉంటే చట్టవ్యతిరేక పనుల వైపు ఆలోచనలు రావని పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. తద్వారా మానసిక, శారీరక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండవచ్చన్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలతో సమయం గడపాలని, వ్యక్తిగత కారణాలతో ఏర్పడే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రతి శనివారం కమిషనరేట్లో పనిచేసే సిబ్బందిని కలుస్తామని, ఏవైనా సమస్యలు లేదా వినతులు ఉన్నట్లయితే కార్యాలయానికి వచ్చి నేరుగా కలవవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, శేఖర్, సంపత్, ఆర్ఎస్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply