Sri Ranganatha | జలాల్‌పూర్ గ్రామస్తుల కొంగు బంగారం

Sri Ranganatha | జలాల్‌పూర్ గ్రామస్తుల కొంగు బంగారం
బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని జలాల్ పూర్ గ్రామ శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలువ ఉండే ప్రాంతంలోని కొండల్లో నెలకొన్న శ్రీ రంగనాథుడు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట ముంపునకు గురైన జాలాల్ పూర్ గ్రామ కొండపై గుహలో 800 సంవత్సరాల క్రితం శ్రీ రంగనాద స్వామి స్వయంభూగా వెలిసినట్లు పూర్వీకులు చెబుతారు. ప్రకృతి ఒడిలో ఓ వైపు గంగమ్మ, మరో వైపు చెరువు కొండ ప్రాంతం గుహలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన శ్రీ రంగనాథుడు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా నిత్య పూజలు అందుకుంటున్నాడు.
Sri Ranganatha | ఆలయ చరిత్ర

ముంపునకు గురైన గ్రామ శివారులో పెద్ద కొండప్రాంతం ఉంది. శ్రీరాముడు రావణుడిని సంహరించిన తరువాత బ్రహ్మహత్యాపాపం తొలిగి పోయేందుకు దక్షిణ అభిముఖంగా ప్రవహించే గోదావరికి బయల్దేరినప్పుడు ఈ కొండ ప్రాంతంలోనే సేద తీరుతాడు. ఆ సమయంలో విభీషణుడు శ్రీరాముడిని నిత్యం మీరు అరాధించే దైవం రూపాన్ని కనులారా చూడాలని ఉందని కోరుతాడు. దీంతో విభీషణుడు కోరిక మేరకు శ్రీరాముడు భక్తితో వేడుకోగా శ్రీ రంగనాథుడు ఈ కొండలో వెలిసి దర్శనమిచ్చినట్లు ఆలయ పూజారులు తెలుపుతున్నారు.
Sri Ranganatha | ఎల్లప్పుడూ ఉత్తర ద్వార దర్శనమే

ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడి శ్రీరంగనాత స్వామి ఎల్లప్పుడూ భక్తులకు ఉత్తర ద్వారం ద్వారానే దర్శనమిస్తారు.స్వామి వెలిసిన గుహలోనికి ఒక్కొక్కరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.ఆలయ ప్రాంగణంలోని చెట్టుపై నుంచి పూలను కోసి స్వామి మూర్తిపై వేస్తే, ఒక్క పువ్వయినా స్వామి విగ్రహం పై నిలబడితే కోరన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.
Sri Ranganatha | ఘనంగా ఉత్సవాలు
శ్రీ రంగనాథ స్వామి ఉత్సవాలను ప్రతి ఏడాది ఉగాది,వైకుంఠ ఏకాదశి, మకర సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ఘనంగా నిర్వహిస్తారు. గోదాదేవి-శ్రీ రంగనాథుల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి నెల రెండో శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో అన్న ప్రసాదాణ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. గ్రామానికి దూరంగా ఆలయం ఉన్నప్పటికీ నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
Sri Ranganatha | ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం

శ్రీ రంగనాథ స్వామి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి, గోదాదేవి శ్రీ రంగనాథుల కల్యాణ మహోత్సవాలను ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు ద్యాగ నర్సారెడ్డి,ఉపాధ్యక్షుడు ఎంబారి ఆనంద్ లు తెలిపారు.
Sri Ranganatha | నిత్య పూజలు ఉంటాయి

శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో నిత్య పూజలు ఉంటాయని ఆలయ పూజారి వేణుగోపాల్ తెలిపారు. ప్రతిరోజు స్వామి వారికి దద్దోజనం ప్రసాదం ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు.
ఆలయ పూజారి వేణుగోపాల్
