West Bengal Politics | నందిగ్రామ్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన సువేందు
West Bengal Politics | నందిగ్రామ్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన సువేందు
West Bengal Politics | మమతా హయాంను ముగించిన 2026 ఎన్నికల ఫలితం
తృణమూల్ నుంచి బీజేపీ వరకు రాజకీయ ప్రయాణం
బెంగాల్ రాజకీయాల్లో మారుతున్న ప్రజాభిప్రాయం
ముఖ్యమంత్రిగా సువేందు ముందున్న సవాళ్లు
West Bengal Politics | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 ఎన్నికలు చారిత్రాత్మక మలుపుగా నిలిచాయి. దాదాపు పదిహేనేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకున్న మమతా బెనర్జీ నాయకత్వానికి ప్రజలు బ్రేక్ వేస్తూ, భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని అప్పగించారు. ఆ విజయానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు సువేందు అధికారి. ఈ పరిణామం కేవలం ప్రభుత్వ మార్పు కాదు. ఇది బెంగాల్ రాజకీయ మానసిక స్థితిలో వచ్చిన పెద్ద మార్పుకు సంకేతం.
ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా, ఉద్యమాల్లో ఆమెకు కుడిభుజంగా పనిచేసిన సువేందు అధికారి, ఇప్పుడు అదే నాయకురాలిని రాజకీయంగా అధిగమించి అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లోనే అరుదైన సంఘటనగా మారింది. సువేందు అధికారి రాజకీయ ప్రయాణం ఒక్కరోజులో జరిగినది కాదు. దశాబ్దాల పాటు కష్టపడి నిర్మించుకున్న నాయకత్వానికి ఇది ఫలితం.
పూర్బ మేదినీపూర్ జిల్లాలో రాజకీయంగా ప్రభావవంతమైన కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే రాజకీయాలను దగ్గరగా చూశారు. ఆయన తండ్రి సిసిర్ అధికారి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు. మొదట కాంగ్రెస్ విద్యార్థి రాజకీయాల ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సువేందు, 1998లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించినప్పుడు ఆమెతో కలిసి నడిచారు.
ఆ సమయంలో బెంగాల్లో వామపక్షాల ఆధిపత్యం బలంగా ఉండేది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సీపీఎం పార్టీని సవాలు చేయడం అంత తేలికైన విషయం కాదు. అయితే సువేందు గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ప్రజల సమస్యలను నేరుగా వినడం, స్థానిక నాయకత్వాన్ని పెంచడం, గ్రామాల్లో పాదయాత్రలు చేయడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా పూర్బ మేదినీపూర్ ప్రాంతంలో ఆయన బలమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు.
2007లో జరిగిన నందిగ్రామ్ ఉద్యమం సువేందు అధికారిని రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా నిలబెట్టింది. భూసేకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేక ప్రజా ఉద్యమంగా మారాయి. ఆ ఉద్యమంలో ప్రజలను సమీకరించడం, ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చడం వంటి అంశాల్లో సువేందు కీలక పాత్ర పోషించారు.
నందిగ్రామ్ ఉద్యమం తర్వాత వామపక్ష ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అదే చివరకు 34 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలికింది. 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి రావడంలో కూడా ఆ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో మమతా ఉద్యమానికి ముఖచిత్రమైతే, నేలమీద ప్రజలను సమీకరించిన నాయకుల్లో సువేందు ఒకరు.
ఆ తర్వాత సువేందు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. 2009లో తమ్లుక్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన, యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ కాలక్రమేణా మమతా బెనర్జీతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి.
ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ ఎదుగుదల తర్వాత పార్టీలో తన ప్రాధాన్యం తగ్గుతోందనే భావన సువేందులో పెరిగింది. చివరకు ఆయన తృణమూల్ కాంగ్రెస్ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరడం బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. బీజేపీలో చేరిన తర్వాత సువేందు మరింత దూకుడుగా రాజకీయాలు ప్రారంభించారు. “తోలాబాజ్ భాయ్పో హటావో” నినాదంతో మమతా-అభిషేక్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు, పార్టీ కేడర్ హింస వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
2021 ఎన్నికల్లో నందిగ్రామ్ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఒకవైపు మమతా బెనర్జీ, మరోవైపు ఆమె మాజీ సన్నిహితుడు సువేందు అధికారి. చివరకు సువేందు మమతాను ఓడించడం రాజకీయంగా భారీ సందేశాన్ని ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, నందిగ్రామ్ విజయం సువేందును రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యామ్నాయ నాయకుడిగా నిలబెట్టింది. అదే సమయంలో బీజేపీకి మానసిక బలం ఇచ్చింది.
2026 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకున్నట్లు కనిపించింది. నిరుద్యోగం, రాజకీయ హింస, అవినీతి ఆరోపణలు, గ్రామీణ అసంతృప్తి ఇవన్నీ కలిసి అధికార వ్యతిరేక వాతావరణాన్ని పెంచాయి. ఈ పరిస్థితిని సువేందు అధికారి సమర్థంగా వినియోగించుకున్నారు. చివరకు బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించగా, పార్టీ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.
ఇది కేవలం వ్యక్తిగత విజయం కాదు; బెంగాల్ రాజకీయాల్లో జరిగిన సామాజిక-రాజకీయ మార్పుకు ప్రతిబింబం. అయితే ఇప్పుడు సువేందు అధికారి ముందున్న అసలు పరీక్ష పరిపాలన. రాజకీయ హింసను నియంత్రించడం, పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి.
ఒకప్పుడు ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన సువేందు అధికారి, ఇప్పుడు పరిపాలకుడిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన దశలో నిలిచారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుని ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆయన ముందున్న అతిపెద్ద బాధ్యత.
వాడవల్లి శ్రీధర్
