యాదాద్రిలో వైభవంగా స్వామివారి జన్మనక్షత్ర వేడుకలు

యాదాద్రిలో వైభవంగా స్వామివారి జన్మనక్షత్ర వేడుకలు

  • భక్తులతో కిటకిటలాడిన క్షేత్రం
  • రూ. 45.46 లక్షల ఆదాయం

ప్రతినిధి, యాదాద్రి, ఆంధ్రప్రభ: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సెలవు రోజు కావడంతో పాటు స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే వైదిక సంప్రదాయం ప్రకారం స్వయంభూవులకు పంచామృత అభిషేకాలు గావించి, 108 కలశాలతో అష్టోత్తర శతఘటాభిషేకం అత్యంత వైభవంగా చేపట్టారు.

వేద మంత్రోచ్ఛారణలు, పంచసూక్త పఠనాల నడుమ హోమం నిర్వహించి, అనంతరం ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, తులసీ దళాలతో సహస్ర నామార్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.


​ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. వైకుంఠ ద్వారం వద్ద ఉన్న స్వామివారి పాదాలకు ఆలయ ఈవో జె. భవాని శంకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యాత్రను ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

తెల్లవారుజామునే భక్తులు పుష్కరిణిలో స్నానాలు ఆచరించి, కొండపై దీపారాధనలు చేస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు

ధర్మ దర్శనానికి 3 గంటల సమయం..

​భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైన, క్రింద వాహనాల రాకపోకలతో యాదాద్రి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. ప్రసాద విక్రయశాలలు, కల్యాణ కట్ట, అన్నదాన సత్రాలు మరియు క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో కిటకిటలాడాయి. ఈ ఒక్క రోజే వివిధ కైంకర్యాలు, టికెట్ల విక్రయాల ద్వారా ఆలయానికి రూ. 45,46,811 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది మరియు పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Leave a Reply