పారదర్శకంగా ఎస్‌ఐఆర్ నమోదు..

ఇంటింటికీ కలెక్టర్ పరిశీలన

ప్రతి ఓటరిని గుర్తించి నమోదు చేయాలి.. తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై కూడా ఆరా

తిరుపతి, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి, ఓటర్ల నమోదు, ధృవీకరణలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.

ప్రతి ఇంటిని సందర్శించి 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుతం నివసిస్తున్న వారి వివరాలను సరిపోల్చి నమోదు ఫారాలు అందజేసి, వాటిని పూరించడంలో సహకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ మొత్తం బీఎల్‌ఏల సమక్షంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు.

శుక్రవారం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులోని శంకర్‌నాయుడు కాలనీ, ముత్యాలమ్మ గుడి వీధి, వసుంధర నగర్ ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై అవగాహన కల్పించారు. పలువురు ఓటర్లకు స్వయంగా నమోదు ఫారాలు అందజేశారు.

2002 ఓటర్ల జాబితాతో తప్పనిసరిగా సరిపోల్చాలి

ఇంటింటి సర్వే సందర్భంగా 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఆ ఇంటిలో నివసిస్తున్న వారి వివరాలను తప్పనిసరిగా సరిపోల్చాలని కలెక్టర్ సూచించారు. జాబితాలో ఉన్న వ్యక్తులు అక్కడ లేకపోతే ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో గుర్తించి నమోదు చేయాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న ఓటర్ల మ్యాపింగ్‌ను త్వరగా పూర్తి చేసి, ప్రత్యేక కార్యాచరణతో నమోదు శాతాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. ప్రతి బీఎల్‌వో తన పరిధిలోని ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి, అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకుండా నమోదు ఫారాలు అందజేసి పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు.

స్థానిక సమస్యలపై ఆరా

అనంతరం తిరుపతి అర్బన్ మండలం ఆటోనగర్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి తాగునీటి సరఫరా, పింఛన్ల పంపిణీ, డ్రైనేజీ సమస్యలపై ఆరా తీశారు. డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, తిరుపతి రూరల్ తహసీల్దార్ జనార్దన్‌రాజు, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్‌బాబు, మున్సిపల్ ఉప కమిషనర్ అమరయ్య, ఎన్నికల విభాగం అధికారులు, బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.