New-Railway-Line : కుప్పం కొత్త రైల్వే లైన్‌ Andhra Prabha Top Story

New-Railway-Line : కుప్పం కొత్త రైల్వే లైన్‌ Andhra Prabha Top Story

  • కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • చి్త్తూరు నుంచి నేరుగా రైలు
  • చుట్టూ తిరిగే బెడ‌ద‌కు స్వ‌స్తి
  • అన్ని రంగాల‌కు ఊతం
  • కొత్త అధ్యాయానికి నాంది

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ).

New-Railway-Line : చిత్తూరు నుంచి కుప్పం వరకు నేరుగా కొత్త రైల్వే మార్గం నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్) నిర్వహించేందుకు రైల్వే శాఖ అనుమతి ఇవ్వడంతో దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం చిత్తూరు కుప్పం మధ్య రైలులో ప్రయాణించాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టణాల మధ్య నేరుగా వెళ్లే అవకాశం లేక తమిళనాడులోని కాట్పాడి, జోలార్‌పేటై జంక్షన్ల మీదుగా సుదీర్ఘంగా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కారణంగా రైలు ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుండటంతో పాటు దూరం కూడా గణనీయంగా పెరుగుతోంది.
ప్రస్తుతం చిత్తూరు నుంచి కుప్పం వెళ్లే రైలు ముందుగా సిద్దంపల్లి, పెయనపల్లి, బొమ్మసముద్రం మీదుగా కాట్పాడి చేరుకుని, అక్కడి నుంచి లత్తేరి, కావనూర్, గుడియాత్తం, ఆంబూరు, వాణియంబాడి, జోలార్‌పేటై మీదుగా తిరిగి సోమనాయకన్‌పట్టి, పచ్చూరు, మల్లానూరు, గుడుపల్లి మీదుగా కుప్పం చేరుతోంది. ఈ మార్గంలో ప్రయాణ దూరం సుమారు 160 కిలోమీటర్లకు చేరుతుండగా, రైలు ప్రయాణ సమయం కూడా ఎక్కువగా పడుతోంది. మరోవైపు చిత్తూరు నుంచి కుప్పం వరకు రహదారి మార్గంలో కేవలం 97 నుంచి 107 కిలోమీటర్ల దూరమే ఉండటంతో బస్సులో 2 గంటల 15 నిమిషాల నుంచి 2 గంటల 50 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకునే వీలుంది. రైలుతో పోలిస్తే బస్సులో సుమారు గంట వరకు సమయం ఆదా అవుతోంది. పైగా ఏపీఎస్‌ఆర్‌టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా తరచూ అందుబాటులో ఉండటంతో ప్రజలు ఎక్కువగా బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతిపాదించిన కొత్త రైల్వే మార్గం సుమారు 135 కిలోమీటర్ల పొడవుతో ఉండే అవకాశం ఉంది. ఈ లైన్ పూర్తయితే ప్రస్తుతం ఉన్న మార్గంతో పోలిస్తే దూరం దాదాపు 25 కిలోమీటర్లు తగ్గడంతో పాటు కాట్పాడి, జోలార్‌పేటై మీదుగా చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గి చిత్తూరు కుప్పం మధ్య రైలు ప్రయాణం ప్రజలకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. ప్రతిపాదిత మార్గం చిత్తూరు నుంచి బంగారుపాళ్యం, పలమనేరు, వీ కోట మీదుగా కుప్పానికి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం జరిగితే ఇప్పటివరకు రైల్వే సౌకర్యం లేని బంగారుపాళ్యం, పలమనేరు, వీ కోట ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. ఈ ప్రాంతాల్లో తొలిసారిగా రైల్వే కూత వినిపించే అవకాశం ఏర్పడనుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, సాధారణ ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

ఇదే సమయంలో చెన్నై–బెంగళూరు హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) ప్రాజెక్టు పలమనేరు ప్రాంతం మీదుగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో పలమనేరులో స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు కుప్పం కొత్త రైల్వే మార్గం పలమనేరు మీదుగా వెళితే ఆ ప్రాంతానికి రైల్వే పరంగా మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశముందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఈ ప్రాజెక్టు ఒక వరంగా మారనుంది. కుప్పం, వీ కోట, పలమనేరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో పండే టమోటా, మామిడి, కూరగాయలు, ఆకుకూరలు, పూలు వంటి ఉద్యాన పంటలను తక్కువ రవాణా వ్యయంతో నేరుగా చిత్తూరుకు, అక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం లారీలు, ఇతర వాహనాలపై ఆధారపడుతున్న రైతులకు సరుకు రవాణా ఖర్చు తగ్గి మంచి గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉంది.పారిశ్రామిక రంగానికి కూడా ఈ రైల్వే మార్గం కీలకంగా మారనుంది. చిత్తూరు జిల్లా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, డెయిరీ పరిశ్రమలు, మామిడి గుజ్జు పరిశ్రమలు, గ్రానైట్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ముడి సరుకుల రవాణా, తయారైన ఉత్పత్తుల ఎగుమతి వేగవంతమై పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయి. భవిష్యత్తులో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు కూడా ఈ రైల్వే లైన్ బలమైన మౌలిక వసతిగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వే దశలో మాత్రమే ఉంది. ఈ సర్వేలో రైల్వే మార్గం తుది అలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలు, వంతెనలు, భూసేకరణ అవసరాలు, వ్యయ అంచనాలు వంటి అంశాలను ఖరారు చేస్తారు. సర్వే పూర్తయిన తర్వాతే వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమై, కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి, నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటుంది. చిత్తూరు కుప్పం కొత్త రైల్వే లైన్ సాకారమైతే అది కేవలం ఒక కొత్త రైల్వే మార్గం మాత్రమే కాదు. చిత్తూరు జిల్లా రవాణా వ్యవస్థకు కొత్త దిశను చూపడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి, విద్య, వైద్య రంగాలకు ఊతమిచ్చే కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలుస్తుంది. ముఖ్యంగా బంగారుపాళ్యం, పలమనేరు, వీ కోట వంటి ప్రాంతాలు తొలిసారిగా ప్రత్యక్ష రైల్వే అనుసంధానం పొందడం ద్వారా జిల్లా సమగ్రాభివృద్ధికి ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.