ఆరోగ్యమే మహాభాగ్యం.. యోగతో ఆరోగ్య చైతన్యం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ప్రతి ఉదయం ఆరోగ్య చైతన్యం వెల్లివిరుస్తోంది. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నానుడిని ఆచరణలో పెడుతూ యువకులు, పెద్దలు ప్రతిరోజూ యోగాభ్యాసం చేస్తున్నారు.

తెల్లవారుజామునే మైదానానికి చేరుకునే వారు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ శారీరక, మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. క్రమశిక్షణతో నిర్వహిస్తున్న ఈ యోగ కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచుతున్నాయి.

యోగ శరీర దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మనసుకు ప్రశాంతతను అందిస్తుందని పాల్గొనేవారు తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొనడం విశేషంగా నిలుస్తోంది.

గ్రామ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే దిశగా యోగ, ధ్యానం, వ్యాయామం ఎంతో దోహదపడుతున్నాయని వారు పేర్కొన్నారు. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రోజువారీ జీవితంలో ఉత్సాహం, ఏకాగ్రత కూడా పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, ఎక్కువ మంది ప్రజలు యోగాభ్యాసంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.

Leave a Reply