అర్హులైన దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు
అర్హులైన దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు
పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందజేస్తాం: జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్ స్కూటీలను మూడు చక్రాల వాహనాలుగా మార్పు చేసి పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందజేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.
దివ్యాంగులు మూడు చక్రాల మోటార్ వాహనాల కోసం నవంబర్ నెలలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో భీమవరం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తులను బుధవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలనతో పాటు అభ్యర్థుల ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో భీమవరం, ఉండి నియోజకవర్గాలకు చెందిన విభిన్న ప్రతిభావంతుల నుంచి మొత్తం 32 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు గాను ప్రతి నియోజకవర్గానికి 10 మోటార్ స్కూటీలు చొప్పున మొత్తం 70 పెట్రోల్ స్కూటీలు మంజూరైనట్లు వెల్లడించారు.
వచ్చిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి, అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేపడతామని పేర్కొన్నారు. లబ్ధిదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, వైట్ రేషన్ కార్డు ఉండాలని తెలిపారు. లబ్ధిదారుల పేరుపై ఇతర వాహనాలు రిజిస్ట్రేషన్ అయి ఉండకూడదన్నారు.
విద్యార్థులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళలు, పురుషులకు సమాన అవకాశాల కల్పనలో భాగంగా 50 శాతం మహిళలకు, 50 శాతం పురుషులకు వాహనాలు మంజూరు చేయనున్నట్లు వివరించారు. లబ్ధిదారుల అర్హతలు, శారీరక ఫిట్నెస్ను పరిగణనలోకి తీసుకుని పెట్రోల్ స్కూటీలను మూడు చక్రాల వాహనాలుగా మార్పు చేసి పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.
రెండో విడతగా జూన్ 4న తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన తణుకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు అదే రోజు తణుకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
మూడో విడతగా జూన్ 5న పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాలకు సంబంధించిన కార్యక్రమం పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్లైన్లో సమర్పించిన ధ్రువపత్రాల రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు, వైకల్యం స్పష్టంగా కనిపించే ఫోటో, రీ-వెరిఫికేషన్ సదరం ధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ జిరాక్స్, ఎస్ఎస్సీ సర్టిఫికెట్, అదనపు అర్హత సర్టిఫికెట్లు, పూర్తి సైజు రెండు పాస్పోర్ట్ ఫోటోలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.
