నిత్య యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

నిత్య యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కోసం కృషి: కలెక్టర్ చదలవాడ నాగరాణి

నరసాపురం, ఆంధ్రప్రభ: ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని వశిష్ట గోదావరి నదీ తీరంలో ఉన్న వలందర్ రేవు ప్రాంగణంలో గురువారం ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు.

ప్రకృతి సోయగాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో చదలవాడ నాగరాణి, బొమ్మిడి నాయకర్, టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు తదితరులు పాల్గొని యోగాసనాలు అభ్యసించారు.

యోగ ఇంటర్నేషనల్ అథ్లెట్ బాలం శిరీష మార్గదర్శకత్వంలో గంటన్నరపాటు సాగిన ఈ కార్యక్రమంలో సుమారు 1,200 మంది పాల్గొన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఉత్సాహంగా యోగాసనాలు అభ్యసించారు.

అనంతరం వశిష్ట గోదావరిలో బోట్లపై నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోట్లపై యోగా విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ఆరోగ్యం ఉన్న చోటే సంపద ఉంటుందని అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగ అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, అలాంటి పరిస్థితులను అధిగమించడంలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగను భాగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం యోగాను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.

ప్రపంచ యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా ప్రతి నెల కనీసం ఒకరోజు మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో సామూహిక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యోగ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, యోగాతో పాటు సైక్లింగ్ వంటి ఆరోగ్యకర అలవాట్లను ప్రజలు అలవర్చుకోవాలని సూచించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో గోదావరి తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

జూన్ 14న పెనుగొండలో ‘టెంపుల్ యోగా’ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే రోజు ఆన్‌లైన్ యోగా కార్యక్రమం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ ఆన్‌లైన్ ద్వారా అనుసంధానమై ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

యోగ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, జిల్లా ఆయుష్ అధికారి శ్రీరామ్, యోగా ఇంటర్నేషనల్ అథ్లెట్ బాలం శిరీష, నేషనల్ యోగా అథ్లెట్ పి. రోహిణి, స్థానిక నాయకులు పొత్తూరి రామరాజు, ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, యోగా సాధకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply