గ్రామ సేవలకు డిజిటల్ బలం..

గ్రామ సేవలకు డిజిటల్ బలం..
గ్రామస్థాయిలో పథకాల అమలు వేగానికి సహాయం.
పారదర్శకతకు నూతన దిశ.
తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు..
వీవోఏల జీతాల పెంపు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని హామీ..
స్వయం ఉపాధి,సేవ కలయికే ఆదర్శం…
కొమ్మిరెడ్డిపల్లి వీవోఏకు ఎమ్మెల్యే సత్కారం
తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గంలో గ్రామస్థాయిలో సేవలందిస్తున్న గ్రామ సంఘ సహాయకులకు (వీవోఏలు) డిజిటల్ సదుపాయాలు అందించేందుకు ముందడుగు పడింది. నాలుగు మండలాలకు చెందిన 159 మంది వీవోఏలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గ్రామాభివృద్ధిలో వారి పాత్రను కొనియాడారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్మార్ట్ ఫోన్లను అందజేస్తూ… గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధానంలో వీవోఏల పాత్ర కీలకమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28,500 మంది గ్రామ సంఘ సహాయకులకు రూ.15,000 విలువ గల స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందించడం ద్వారా వారి సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలో పనిచేస్తున్న వీవోఏలు సంక్షేమ పథకాల అమలు, డ్వాక్రా సంఘాల బలోపేతం, మహిళా సాధికారతలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. డిజిటల్ సదుపాయాలతో ఇప్పుడు వారు డేటా సేకరణ, లబ్ధిదారుల నమోదు, పథకాల అమలు వంటి పనులను వేగంగా, పారదర్శకంగా నిర్వహించగలరని పేర్కొన్నారు. వీవోఏల సమస్యలపై స్పందిస్తూ… వారి జీతాల పెంపు అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వీవోఏ స్వయం ఉపాధితో ఆదర్శంగా నిలుస్తున్నందుకు ప్రత్యేకంగా సత్కరించారు. ఉద్యోగంతో పాటు పాల వ్యాపారం నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్న ఆయన కృషిని ప్రశంసించారు. ఉద్యోగంతో పాటు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చని ఇతరులకు సందేశమిచ్చారు. డ్వాక్రా వ్యవస్థ మహిళా సాధికారతకు పునాది వేసిందని పేర్కొంటూ… మూడు దశాబ్దాల క్రితమే ప్రారంభమైన ఈ ఉద్యమం వల్లే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.
మహిళల విద్య, వివాహాల కోసం తక్కువ వడ్డీ రుణాలను అందించే కొత్త పథకాల ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని వివరించారు. వీవోఏలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ల పంపిణీతో గ్రామ స్థాయిలో సేవలు మరింత సమర్థవంతంగా మారనున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రజలకు వేగవంతమైన సేవలందించడంలో ఈ డిజిటల్ సదుపాయాలు కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, డ్వాక్రా మహిళలు, వీవోఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
