ప్రభుత్వ పాఠశాలలే నాణ్యమైన విద్యకు చిరునామా..
ప్రభుత్వ పాఠశాలలే నాణ్యమైన విద్యకు చిరునామా..
ప్రభుత్వ విద్యపై అపోహలు తొలగించేందుకే ఈ ప్రదర్శన..
తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలి..
నాణ్యమైన పారదర్శక విద్యా ప్రమాణాలు..
ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలను సందర్శించండి.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ శ..
కలెక్టరేట్లో ప్రభుత్వ పాఠశాలల ఎక్స్ పో ప్రారంభం..
20 పాఠశాలలకు చెందిన అద్భుత ఆవిష్కరణల ప్రదర్శన..
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య, అత్యుత్తమ ఫలితాలు, ఆధునిక మౌలిక సదుపాయాలకు నిలయాలుగా మారాయని, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ‘గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో–2026’ను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రగతి, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల కృషిని ప్రజలకు చేరవేసే లక్ష్యంతో గురువారం విజయవాడ బందరు రోడ్డులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని 20 మండలాలకు చెందిన ప్రత్యేక స్టాల్స్‌ను కలెక్టర్ సందర్శించి విద్యార్థులు సాధించిన విజయాలు, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వినూత్న విద్యా కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలు, పాఠశాలల్లో లభిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన కలెక్టర్ లక్ష్మీష, ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలు విశేష ప్రతిభ కనబరిచాయని తెలిపారు.

అనేక మంది విద్యార్థులు 590కు పైగా మార్కులు సాధించడమే కాకుండా, జిల్లా స్థాయిలో 72 శాతం మంది ఫస్ట్ క్లాస్ ఫలితాలు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏముంటుంది అనే సందేహానికి సమాధానంగా ఈ ఎక్స్‌పో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు సాధించిన విజయాలు, జేఈఈ, ఇతర పోటీ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల వినూత్న బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సైన్స్ ల్యాబ్‌లు, క్రీడా సౌకర్యాలు, వృత్తి విద్య కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారేనని, వారి అంకితభావం వల్లే అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయని కలెక్టర్ ప్రశంసించారు. విద్యార్థుల విద్యా పురోగతిని ప్రతి నెల సమీక్షిస్తూ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌తో పాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలే మెరుగైన విద్య అందిస్తాయనే భావనను విడనాడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అత్యున్నత స్థాయి విద్య, సమగ్ర వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఐఐటీలు, సివిల్స్, పోలీసు సేవలు వంటి ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ముందుకు సాగుతున్నారని చెప్పారు. జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ విద్యా ప్రదర్శనకు తల్లిదండ్రులు, విద్యా ప్రేమికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను స్వయంగా పరిశీలించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

