26thMayeditorial | యువత అసంతృప్తికి సోషల్ మీడియా వేదిక

26thMayeditorial | యువత అసంతృప్తికి సోషల్ మీడియా వేదిక
26thMayeditorial | స్మార్ట్‌ఫోన్ విప్లవంతో మారిపోయిన సమాచార ప్రపంచం
కాక్రోచ్ జనతా పార్టీ వివాదం ఎలా వైరల్ అయింది?
ఫేక్ లింకులు, సైబర్ నేరాలతో పెరుగుతున్న ప్రమాదం
సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమా?
26thMayeditorial | సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనిపైనే ముందుకు సాగుతోంది. స్మార్ట్‌ఫోన్ విప్లవం సమాచార వ్యవస్థను ప్రతి ఒక్కరి అరచేతిలోకి తీసుకువచ్చింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియా స్పందిస్తోంది. అభిప్రాయాలు ఎలా ఉన్నా సమాచారం మాత్రం స్పష్టంగా, సూటిగా అందుతోంది.
సోషల్ మీడియాకు చదవుతో పనిలేదు. కేవలం స్మార్ట్‌ఫోన్ ఆపరేషన్ తెలిసితే చాలు సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలన్నీ తిలకించవచ్చు. మాధ్యమం ఏదైనా, అందరూ ముందుగా ఆకర్షితులయ్యేది సమాచారం ఏంటనే అంశంపైనే. అది ఏమాత్రం సగటు జీవికి వ్యతిరేకంగా కనిపించినా ఇక చుక్కలు చూపించడం ఖాయం.
ప్రస్తుతం జెన్ Z ఉద్యమాలే అన్నిచోట్లా కనిపిస్తున్నాయి. అంటే యువతలో ఏదో ఒక రకమైన అసంతృప్తి గూడుకట్టుకుంది. వారు ఊహించిన, ఆశించిన జీవితం కనిపించకపోయినా, లభించకపోయినా వారిలోని అశాంతి బద్దలయ్యేది పాలకులపైనే. ఈ విషయాన్ని గ్రహించిన నాయకులు కూడా తెలివిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమం వేదికగా వారు తమ అభిప్రాయాలను విరివిగా వెల్లడిస్తున్నారు. దీంతో అన్ని రంగాల వ్యక్తులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వారిని ఫాలో కావడం తప్పనిసరి అయింది.
వివాదాస్పదమైనా లేదా విస్తృత ప్రచారంలోకి వచ్చిన ఏ అంశమైనా అతికొద్ది సమయంలోనే ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఒకవేళ అది దారితప్పినా, లేదా ఆ తర్వాత సరైన పునాది లేకపోయినా అంతే వేగంగా తుస్సుమంటోంది.
తాజాగా సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక వ్యాఖ్య రకరకాల విన్యాసాలకు గురైంది. ఆయన ఏ సందర్భంలో ఏ అభిప్రాయం వ్యక్తం చేశారో కానీ, యువతను కాక్రోచ్‌తో పోల్చినట్టు, సోమరిపోతులుగా అభివర్ణించినట్టు సోషల్ మీడియాలో గుప్పుమంది. ఇంకేముంది, అగ్గి సోకగానే పెట్రోలు భగ్గున మండినట్లు సీజేఐ వ్యాఖ్యలపై యువతలో ఆగ్రహం మండిపోయింది.
కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఏకంగా ఒక పార్టీనే ఆవిర్భవించింది. లక్షలు, కోట్లలో జెన్ Z ఫాలోవర్లు జతకట్టారు. ఎంత వేగంగా ఇది వ్యాప్తి చెందిందో అంతే వేగంగా సంఘ వ్యతిరేక శక్తులు కూడా జొరబడ్డాయి. ఫేక్ లింకులు తయారు చేసి జనం మీదకు వదిలారు. వాటిని క్లిక్ చేసిన వారి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయినట్టు వార్తలొచ్చాయి.

చివరకు తమ ఖాతా హ్యాక్ అయిందని, అది భాజపా చేసిందని ఆ పార్టీ వ్యవస్థాపకుడే ఆరోపించే పరిస్థితి వచ్చింది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకలాపాలపై విచారణ జరిపించాలని ఒక న్యాయవాది సుప్రీంలోనే పిల్ దాఖలు చేశారు. అయితే దీన్ని అంత సెంటిమెంటల్‌గా తీసుకోవద్దని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఏతావాతా చివరకు తేలింది ఏమిటంటే, యువతలో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉందన్న విషయం ఈ వ్యవహారంతో తేటతెల్లమైంది. అలాగే సరైన నాయకత్వం ఉంటే సోషల్ మీడియా ఎంత బలమైన శక్తిగా మారుతుందో కూడా ఈ పరిణామం మరోసారి స్పష్టం చేసింది.
సోషల్ మీడియాకు ఎంతో కొంత నియంత్రణ ఉండాల్సిందేనన్నది చాలా సందర్భాల్లో నిరూపితమవుతోంది. న్యాయవ్యవస్థ ఇందుకు సంబంధించి సమగ్ర అధ్యయనం, విచారణలు జరిపించి కళ్లెం వేస్తే తప్ప, ప్రోగ్రెసివ్ వ్యవస్థగా ఉండాల్సిన సోషల్ మీడియా కొంతమంది స్వార్థపరులు, సంఘవ్యతిరేక శక్తులు, సైబర్ నేరగాళ్లు చేతుల్లోకి వెళ్లి సామాన్యులు బలయ్యే పరిస్థితి ఉంటుంది. లోపాలను సరిదిద్ది పకడ్బందీ వ్యవస్థగా మార్చగలిగితే అది సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రంగా వర్ధిల్లుతుంది.
