చిట్యాలలో గాలివాన బీభత్సం..

చిట్యాలలో గాలివాన బీభత్సం..
కూలిన చెట్లు, నిలిచిన విద్యుత్ సరఫరా
చిట్యాల, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో పాటు వచ్చిన బలమైన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మండలంలోని పాఠశాల ఆవరణలో భారీ చెట్లు కూలిపోగా, మార్కెట్‌లో ఉంచిన రైతుల ధాన్యం తడిసిపోయింది.
ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భారీ వేపచెట్టు కూలిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంకట్రావుపల్లి, చింతలపల్లి, పోచమ్మ గుడి ప్రాంతాల్లో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో అక్కడ నిలిపి ఉంచిన కారు ధ్వంసమైంది. వెంటనే జేసీబీ సహాయంతో చెట్లు, కూలిన భాగాలను తొలగించే పనులు చేపట్టారు.
విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతు పనులు ప్రారంభించి త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై కూలిన చెట్లను చిట్యాల, ఏఆర్ పల్లి గ్రామ పంచాయతీల సిబ్బంది తొలగించారు.
