జిల్లాలో SIR–2026 సవరణను సమర్థవంతంగా నిర్వహించాలి
జిల్లాలో SIR–2026 సవరణను సమర్థవంతంగా నిర్వహించాలి
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR)–2026 కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సూచించారు.
పుట్టపర్తిలో SIR–2026 కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్స్‌తో పాటు అవసరమైన కిట్లను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమని, అందులో తప్పులు లేకుండా ఖచ్చితమైన వివరాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఇంటింటి సర్వే సమయంలో ప్రతి కుటుంబాన్ని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు వివరాలను నమోదు చేయాలని సూచించారు.
ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల పరిశీలనలో జాగ్రత్తలు పాటించాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నాణ్యతను పెంచడం, పారదర్శకతను కాపాడడం ఈ ప్రత్యేక సవరణ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఎన్నికల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే SIR–2026 కార్యక్రమం విజయవంతమవుతుందని కలెక్టర్ అన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.
