కర్నూలులో జోరుగా ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియ

59.13 శాతం ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ.. ఆలూరు ముందంజ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమం కర్నూలు జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. జూన్ 15 నుంచి జూలై 14 వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు.

సోమవారం సాయంత్రం 4 గంటల నాటికి జిల్లాలోని 20,86,119 మంది ఓటర్లలో 12,33,566 మందికి ఫారాలు అందజేయగా, ఇది 59.13 శాతంగా నమోదైంది. అందిన ఫారాల్లో 23,528 ఫారాలను డిజిటలైజ్ చేయగా, ఇది మొత్తం ఓటర్లలో 1.13 శాతంగా ఉంది. ఓటరు జాబితాను మరింత పకడ్బందీగా రూపొందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ఆలూరు నియోజకవర్గం ఫారాల పంపిణీలో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 2,63,989 మంది ఓటర్లలో 2,01,825 మందికి ఫారాలు పంపిణీ చేయడంతో 76.45 శాతం పురోగతి నమోదైంది.

పత్తికొండ నియోజకవర్గంలో 3,35,015 మంది ఓటర్లకు గాను 2,28,483 మందికి ఫారాలు అందజేయడంతో 68.20 శాతం పంపిణీ పూర్తయింది. బనగానపల్లెలో 2,26,970 మంది ఓటర్లలో 1,46,356 మందికి ఫారాలు అందజేయగా 64.48 శాతం నమోదైంది.

కోడుమూరు నియోజకవర్గంలో 2,51,496 మంది ఓటర్లలో 1,59,833 మందికి ఫారాలు పంపిణీ చేసి 63.55 శాతం సాధించారు. మంత్రాలయంలో 2,12,841 మంది ఓటర్లకు గాను 1,32,139 మందికి ఫారాలు అందజేయడంతో 62.08 శాతం పురోగతి నమోదైంది.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2,53,206 మంది ఓటర్లలో 1,31,083 మందికి ఫారాలు అందజేసి 51.77 శాతం పూర్తి చేశారు. కర్నూలు నియోజకవర్గంలో 2,74,622 మంది ఓటర్లలో 1,22,579 మందికి ఫారాలు పంపిణీ చేసి 44.64 శాతం నమోదు చేశారు.

జిల్లాలో అత్యల్ప పురోగతి ఆదోని నియోజకవర్గంలో నమోదైంది. 2,67,980 మంది ఓటర్లలో 1,11,268 మందికి మాత్రమే ఫారాలు అందజేయడంతో 41.52 శాతం పంపిణీ పూర్తైంది.

డిజిటలైజేషన్ ప్రక్రియలో కూడా ఆలూరు ముందంజలో నిలిచింది. అక్కడ 3,640 ఫారాలు డిజిటలైజ్ చేయగా, ఎమ్మిగనూరులో 3,474, బనగానపల్లెలో 3,010, ఆదోనిలో 2,942, కర్నూలులో 2,748 ఫారాలు డిజిటలైజ్ చేశారు.

ఎస్‌ఐఆర్-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తుండగా, అందిన ఫారాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఓటరు జాబితాలో లోపాలు లేకుండా, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు కావాలనే లక్ష్యంతో అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నారు.