గిరిజన అభివృద్ధిపై ఎస్టీ కమిషన్ సభ్యుడితో ఐటిడీఏ పీవో చర్చలు

  • నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌తో ఐటిడిఏ పీవో భేటీ

ఉట్నూర్, ఆంధ్రప్రభ : నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరంద్ హైదరాబాద్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

భేటీ సందర్భంగా గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పురోగతిపై ప్రాజెక్టు అధికారి మంద మకరంద్ వివరించారు.

అలాగే గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు.

ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో గిరిజన సంక్షేమం కోసం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఇరువురు ప్రస్తావించారు.