Telugu States | తెలంగాణ, ఏపీ అభివృద్ధిలో పోటీపడాలని ఆకాంక్ష

Telugu States | తెలంగాణ, ఏపీ అభివృద్ధిలో పోటీపడాలని ఆకాంక్ష

Telugu States | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుజాతి ఎప్పటికీ ఒక్కటేనని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రెండు రాష్ట్రాలు పోటీపడి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్లాలి

తెలుగు నేలకు గొప్ప చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల వారసత్వం ఉందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో తెలుగు ప్రజలు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ అభివృద్ధికి కీలక కేంద్రాలుగా ఎదగాలని పేర్కొన్నారు.

హైదరాబాద్‌, అమరావతి ప్రపంచ స్థాయి నగరాలుగా ఎదగాలి

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రతి తెలుగు కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకుని, మెరుగైన జీవన ప్రమాణాలు సాధించాలని అన్నారు.

‘వికసిత్ భారత్-2047’ లక్ష్య సాధనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేసి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటాలని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్టులో పేర్కొన్నారు.

Leave a Reply