సరస్వతి పుష్కరాలకు శారదా పీఠాధిపతి విచ్చేసిన వేళ..

మహదేవపూర్, ఆంధ్రప్రభ : పవిత్ర సరస్వతీ నది అంత్య పుష్కరాల సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి శుక్రవారం కాళేశ్వరం క్షేత్రాన్ని సందర్శించడంతో ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. వేలాది మంది భక్తులు స్వామీజీ దర్శనం కోసం తరలిరాగా, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, హరినామ స్మరణల మధ్య క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
ఉదయం సరస్వతీ ఘాట్‌కు చేరుకున్న స్వామీజీ త్రివేణి సంగమంలో పవిత్ర పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల శ్రేయస్సు, లోకకల్యాణం, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం సంకల్ప పూజలు చేశారు. పుష్కర స్నానం అనంతరం స్వామీజీ ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంను సందర్శించి స్వామివారికి విశేష పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు.

తదుపరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన, అర్చనలు నిర్వహించి జగన్మాత కృప ప్రజలందరిపై ప్రసరించాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికి సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. సరస్వతీ నది జ్ఞానానికి, సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక అని పేర్కొన్న ఆయన, పుష్కరాలు కేవలం నదీ స్నానానికి మాత్రమే పరిమితం కాకుండా మనస్సును పవిత్రం చేసుకునే దివ్య అవకాశమని అన్నారు. ధర్మాచరణ, భక్తి, సేవా భావనలతో జీవితం సార్థకమవుతుందని సూచించారు.
ప్రవచనం అనంతరం భక్తులకు ఆశీర్వచనం అందించిన స్వామీజీ తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఆయన ఆశీస్సులు పొందేందుకు మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామీజీ సందర్శనతో కాళేశ్వరం క్షేత్రం మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోగా, సరస్వతి అంత్య పుష్కరాల మహోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేదపండితులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయని పలువురు అభిప్రాయపడ్డారు.
