కొడుకుకు తెలియకుండా 5 ఎకరాల భూమి విక్రయం..

న్యాయం చేయాలని వేడుకోలు

దేవరకద్ర, ఆంధ్రప్రభ: తల్లి, కూతుళ్లు కుమ్మక్కై తనకు తెలియకుండా 5 ఎకరాల భూమిని విక్రయించారని ఓ వ్యక్తి ఆరోపించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది.

మన్యంకొండ హజీలాపూర్ గ్రామానికి చెందిన మంగలి దేవమ్మకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు కృష్ణయ్య ఉన్నారు. భర్త గతంలోనే మృతి చెందగా, సర్వే నంబర్ 214లో ఉన్న 5 ఎకరాల భూమిని తన కుమారుడికి సమాచారం ఇవ్వకుండా వేరే వ్యక్తికి విక్రయించినట్లు కృష్ణయ్య ఆరోపించారు.

విషయం తెలుసుకున్న కృష్ణయ్య రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా భూమి విషయంలో కోర్టులో కేసు నడుస్తోందని, అయితే ఇరువర్గాల లాయర్లు కుమ్మక్కై తనకు తెలియకుండా కేసును డిస్మిస్ చేయించారని ఆరోపించారు.

తనకు కూడా వారసత్వంగా భూమిలో వాటా ఉందని, నిరుపేద కుటుంబానికి చెందిన తమకు న్యాయం చేయాలని కోరారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై తహసీల్దార్ మహ్మద్ హర్షద్ మాట్లాడుతూ.. తల్లి, కొడుకు మధ్య భూమి వివాదంపై కోర్టులో కేసు నడిచిందని, కోర్టు తీర్పు తల్లికి అనుకూలంగా రావడంతో ఆ మేరకే ఆమె సూచించిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. భూమికి సంబంధించి కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తీసుకొస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.