కుంగ్‌ఫూ గ్రాండ్‌మాస్టర్ పోచయ్యకు జగ్గారెడ్డి సన్మానం

  • గిన్నిస్ వరల్డ్ రికార్డుపై అభినందనలు
  • భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కుంగ్‌ఫూ కరాటే కటా విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సంగారెడ్డి జిల్లా కుంగ్‌ఫూ గ్రాండ్‌మాస్టర్ పోచయ్యను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంగళవారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కుంగ్‌ఫూ కటా ప్రదర్శనలో 1,212 మంది సభ్యులతో కూడిన బృందం కేవలం అరగంటలో 72 సార్లు కటా ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది.

ఈ ప్రదర్శన ఏప్రిల్ 26న నిర్వహించగా, మూడు రోజుల క్రితం లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా రికార్డును ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్లను జారీ చేసింది. ఈ చారిత్రాత్మక ప్రదర్శనలో సంగారెడ్డి జిల్లాకు చెందిన కుంగ్‌ఫూ గ్రాండ్‌మాస్టర్ పోచయ్యతో పాటు ఆయన శిష్యబృందం పాల్గొని విశేష ప్రతిభ కనబరిచింది. కుంగ్‌ఫూ క్రీడలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన తొలి బృందంగా పోచయ్య బృందం నిలిచింది.

గతంలో గంట వ్యవధిలో 600 మంది కలిసి 30 సార్లు కటా ప్రదర్శించిన ప్రపంచ రికార్డును అధిగమిస్తూ, కేవలం అరగంటలోనే 72 సార్లు కటా ప్రదర్శించి కొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా పోచయ్య జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రికార్డు వివరాలను తెలియజేశారు. ఈ ఘనతపై హర్షం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి, పోచయ్యకు శాలువా కప్పి సన్మానించి అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.