GGH | జిజిహెచ్ లో సేవలు మరింత విస్తృతం…

  • అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తాం…
  • అసంపూర్తి భవనాలను పూర్తి చేస్తాం.
  • రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్..
  • ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై ఎంపీ ఎమ్మెల్యేలతో సమీక్ష..
  • రూ 80 కోట్ల రూపాయల ప్రతిపాదనలు చేసిన ప్రజా ప్రతినిధులు..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేటు కార్యాలయంలో విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్, నగర ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావుతో గురువారం ప్రత్యేకంగా సమావేశమై విజయవాడలోని సర్వజన అసుపత్రి అభివృద్ధి గురించి చర్చించారు.

ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ…. క్యాన్సర్ వెద్య సేవల్లో ముఖ్యమైన లినాక్ పరికరాన్ని విజయవాడ జీజీహెచ్ లో అందుబాటులోనికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించి, ఉన్నత వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

విజయవాడ జీజీహెచ్లో లినాక్ ఏర్పాటుకు అవసరమైన స్థలం గుర్తింపు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి (సామాజిక బాధ్యత) ఆర్ధిక సహకారం మార్గాలను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చర్చల్లో పాల్గొన్న డైరెక్టరేటు అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.

క్యాన్సర్ కణాలను నాశనం చేసేందుకు ఉపయోగించే ఈ పరికరం ఏర్పాటుకు ప్రత్యేకంగా బంకరు ఆసుపత్రిలో ఏర్పాటుచేయాల్సి ఉందని అధికారులు చెప్పగా నిపుణులు రప్పించి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి స్పష్టంచేశారు. ఈ పరికరం సమకూర్చేందుకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చేసిన విజ్ఞప్తిపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు హాస్టల్ విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఔషధ నియంత్రణ శాఖ భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకునేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు.

దీనిపై త్వరలోనే సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పాత ప్రభుత్వాసుపత్రిలో మాతా, శిశువైద్య సేవల విస్తరణలో భాగంగా నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విజయవాడ జీజీహెచ్లో సేవలు పొందే వారి సంఖ్య భారీగా పెరిగిందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

వీరి అవసరాలకు తగ్గట్లు కొత్త, పాతాసుపత్రిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సుమారు రూ. 80కోట్ల వరకు అవసరం ఉందని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ పీజీ వైద్య సీట్ల పెంపునకు తగ్గట్లు కేంద్రం నుంచి వచ్చిన నిధుల వినియోగం, విజయవాడ జీజీహెచ్ చేపట్టిన పనులు వివరాలు నివేదించాలని డీఎంఈను ఆదేశించారు.

ఇదేవిధంగా రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రుల్లో చేపట్టిన నిర్మాణాల వివరాలను కూడా తెలియచేయాలని మంత్రి వారికి స్పష్టంచేశారు. ప్రాధాన్య క్రమంలో రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో పూర్తయ్యే క్రిటికల్ కేర్ భవనాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ప్రారంభింపచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో డీఎంఈ డాక్టర్ రఘునందన్, అదనపు డీఎంఈ డాక్టర్ వెంకటేశ్, విజయవాడ జీజీహెచ్ ఇంచార్జి సూపరిండెంటు డాక్టర్ శ్యాం, ఆంకాలజిస్ట్ విభాగ అధిపతి డాక్టర్ నెహూ, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply