27 వేల బడులు.. 1700 స్కూళ్లకే బ్రేక్‌ఫాస్ట్?
27 వేల బడులు.. 1700 స్కూళ్లకే బ్రేక్‌ఫాస్ట్?
ప్రకటనలు ఘనం.. ఆచరణలో మాత్రం పరిమితం
సెంట్రలైజ్డ్ కిచెన్లతో తొలి విడతకు కసరత్తు
పాఠశాలల ఎంపికపై ఇంకా సందిగ్ధత
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని, పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం, ఆచరణలోకి వచ్చేసరికి వెనకడుగు వేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు కావాల్సి ఉండగా, ప్రస్తుతానికి కేవలం 1700 పాఠశాలలకు మాత్రమే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో సెంట్రలైజ్డ్ కిచెన్ సదుపాయం ఉన్న ప్రాంతాల్లోనే దీనిని ప్రారంభించి, ఆ తర్వాత విడతల వారీగా విస్తరించాలని అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కానీ దీనిపైనా పూర్తి స్పష్టత లేకపోవడంతో దీనిపైనా సందిగ్ధత నెలకొంది.
ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సహచరులందరూ ప్రతి వేదికపై ఈ పథకం గురించి గొప్పగా చాటి చెప్పారు. కేవలం విద్యాశాఖ సమావేశాల్లోనే కాకుండా, బహిరంగ సభల్లోనూ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తమ ప్రభుత్వ మైలురాయిగా అభివర్ణించారు. ఏకంగా తెలంగాణ రైజింగ్ నెంబర్ వన్ వంటి చర్చా కార్యక్రమాల్లో కూడా ఈ పథకం ప్రాముఖ్యతను వివరించారు. మే 11 నుంచి 17 వరకు నిర్వహించిన ఎడ్యుకేషన్ వీక్ లో ఈ పథకానికి విపరీతమైన ప్రచారం కల్పించారు. మండల స్థాయి సమావేశాల్లో విద్యాధికారులు దీనిపై ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఆయుధంగా చేసుకుని ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెంచాలని సూచించారు. దీంతో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం ఇచ్చే ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా పెడతామని తల్లిదండ్రులకు నమ్మబలికారు. విద్యాశాఖ విడుదల చేసిన ఆకర్షణీయమైన బ్రోచర్లను పంచుతూ, వారంలో ఏ రోజు ఏ టిఫిన్ (ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటివి) పెడతారో వివరంగా వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న బడిబాటలోనూ ఇదే విషయం చెబుతున్నారు. తీరా ఇప్పుడు కేవలం 1700 స్కూళ్లలోనే అమలు చేస్తామనేసరికి కంగుతిన్నారు.
పాఠశాలల ఎంపికపైనా సందిగ్ధత
ఇప్పటికే జిల్లాల వారీగా డీఈఓల ద్వారా పాఠశాలల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. అయితే ఏ ప్రాతిపదికన ఈ 1700 పాఠశాలలను ఎంపిక చేశారు? మిగిలిన పాఠశాలల పరిస్థితి ఏమిటి? అనే దానిపై విద్యాశాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించాలనేది అధికారుల వాదన అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని వేల సంఖ్యలో ఉన్న పాఠశాలలకు ఈ సౌకర్యం ఎప్పటికి అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఈ పథకం అమలుపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
