మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరగాలని స్వామివారిని వేడుకున్నారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ, శ్రీశైలం క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనదని, జ్యోతిర్లింగ క్షేత్రంగా దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసాన్ని పొందిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
దర్శనం అనంతరం దేవస్థాన వేద పండితులు ఎమ్మెల్యే కి వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అనుచరులు మరియు భక్తులు పాల్గొన్నారు.
