Mulugu ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

Mulugu ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఆంధ్రప్రభ, ములుగు (Mulugu) ప్రతినిధి: ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా డీఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యను వ్యాపారంగా మార్చి దోపిడీ చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ విద్యా సదుపాయాలు, క్రీడా మైదానాలు వంటి మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.