ఫుడ్ సేఫ్టీ బృందానికి ఉత్తమ సేవా పురస్కారం…
ఫుడ్ సేఫ్టీ బృందానికి ఉత్తమ సేవా పురస్కారం…
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య సేవలందించడంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు సంగారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్-టాస్క్ బృందానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన సర్టిఫికేట్‌ను ప్రదానం చేశారు.
ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడంలో, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంలో, అక్రమాలు అరికట్టడంలో సంగారెడ్డి బృందం చూపిన చురుకుదనం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అమృత శ్రీ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో మరింత కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించి నాణ్యమైన ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సేవా పురస్కారం లభించడం ఎంతో గౌరవమని చెప్పారు. ఈ పురస్కారం రావడం ఫుడ్ సేఫ్టీ బృందానికి మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు.
