స్కూల్ బస్సుల భద్రతపై కఠిన ఆదేశాలు

స్కూల్ బస్సుల భద్రతపై కఠిన ఆదేశాలు
డాష్‌బోర్డ్ కెమెరా తప్పనిసరి – డ్రైవర్ల వెరిఫికేషన్‌పై ప్రత్యేక దృష్టి
ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల యాజమాన్యాలతో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, రవాణా శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్కూల్, కాలేజీ బస్సుల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి బస్సులో డాష్‌బోర్డ్ కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలని, డ్రైవర్లు విధుల్లోకి వచ్చే ముందు బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యాలకు ఆదేశించారు. బస్సు డ్రైవర్లు, సహాయక సిబ్బంది గత నేర చరిత్రను పోలీస్ వెరిఫికేషన్ ద్వారా పరిశీలించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని తెలిపారు.
అలాగే ప్రతి బస్సు వెనుక పోలీస్ శాఖ అందజేసిన క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా అతికించాలని సూచించారు. విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. బస్సుల్లో సీసీ కెమెరాల ద్వారా విద్యార్థుల ప్రవర్తనను పర్యవేక్షించడంతో పాటు అవాంఛనీయ ఘటనలు జరిగితే దర్యాప్తుకు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అదనపు ఎస్పీ జి. మునిరాజా మాట్లాడుతూ బస్సుల నిర్వహణలో సాంకేతిక లోపాలకు తావు లేకుండా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ మాట్లాడుతూ అన్ని విద్యాసంస్థల బస్సులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ ద్వారం ఉండాలని స్పష్టం చేశారు.
డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో పాటు అనుభవం కలిగి ఉండాలని, 60 ఏళ్లకు మించిన వారు డ్రైవింగ్ చేయరాదని పేర్కొన్నారు. ప్రతి బస్సులో అటెండర్‌ను నియమించాలని, విద్యార్థుల ఎక్కింపు దిగింపు సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బస్సులు గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు, స్కూల్ మరియు కాలేజీ ప్రతినిధులు పాల్గొన్నారు.
