Saraswati Pushkaralu 2026 | కాళేశ్వరంలో వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు

Saraswati Pushkaralu 2026 | కాళేశ్వరంలో వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు

Saraswati Pushkaralu 2026 | తొలి పుష్కర స్నానం చేయనున్న విజయేంద్ర సరస్వతి స్వామిజీ
భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
300 మంది సిబ్బందితో ప్రత్యేక మెడికల్ క్యాంపులు
త్రివేణి సంగమంలో ఆధ్యాత్మిక శోభ

Saraswati Pushkaralu 2026 | భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : జ్ఞానానికి ప్రతీకగా భావించే సరస్వతి నది అంత్య పుష్కరాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం సిద్ధమైంది. గురువారం నుంచి జూన్ 1 వరకు జరిగే పుష్కరాల కోసం ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదుగా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దీంతో 12 రోజులపాటు త్రివేణి సంగమం ఆధ్యాత్మిక సంద్రంగా మారనుంది.

గోదావరి, ప్రాణహిత, సరస్వతి (అంతర్వాహిని) నదులతో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరానికి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. పుష్కర స్నానాలతోపాటు త్రివేణి సంగమంలో నిర్వహించే తెప్పోత్సవం, ప్రతిరోజూ జరిగే మహా హారతులు, సరస్వతి అమ్మవారి ప్రత్యేక పూజలు, నిత్య హోమాలు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. వేద మంత్రోచ్చారణలు, ఘంటానాదాల మధ్య గంగాహారతిని తలపించే దీపారాధనలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచనున్నాయి. సంగమ తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సరస్వతి అమ్మవారి మండపం, విద్యుత్ దీపాలతో అలంకరించిన భారీ బాహుబలి సెట్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అదేవిధంగా మహాగణపతి, హయగ్రీవ, నవగ్రహ, మహామృత్యుంజయ, ధన్వంతరి, మహారుద్ర తదితర హోమాలను నిర్వహించనున్నారు. ఇక త్రివేణి సంగమ ప్రాంతంలో వెలసిన శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో ఘాట్లు, టెంట్ సిటీలు, అన్నదాన శిబిరాలు, వైద్య కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు విస్తృతంగా చేపట్టారు.

గురువారం నుంచి జూన్ 1 వరకు 12 రోజులు జరిగే పుష్కరాలకు 30 నుండి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.63 కోట్ల నిధులను కేటాయించింది.

శంకర విజయేంద్ర సరస్వతి తొలి స్నానం

పుష్కరాల తొలిరోజైన గురువారం ఉదయం 5.43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం చేసి అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతి రోజూ ఒక ప్రముఖ పీఠాధిపతి ఈ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం చేస్తారు. కాగా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.1.20 కోట్లతో ప్రత్యేకంగా మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నాగేంద్ర స్వామి ఆలయాన్ని రూ.30 లక్షలతో పునర్నిర్మాణం చేశారు.

300 మంది సిబ్బందితో మెడికల్ క్యాంపులు

కాళేశ్వరం పుష్కర ఘాట్లలోని 23 జోన్లలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను వైద్యులు, వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది 300 మందిని ప్రత్యేకంగా నియమించారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో అంబులెన్సులను అందుబాటులో ఉంచనున్నారు. మహాదేవపూర్ పీహెచ్సీని రెఫరల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. పుష్కర యాత్రికుల సౌకర్యార్థం 500 మరుగుదొడ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి కోసం రెండు ఓహెచ్ఆర్సీలను నిర్మించారు. వాహనాల కోసం ఏర్పాటు చేసిన 23 పార్కింగ్ కేంద్రాలతోపాటు 90 షటిల్ బస్సులను ఏర్పాటు చేశారు. రెస్క్యూ బృందాలతోపాటు సుశిక్షితులైన గజ ఈతగాళ్లను సరస్వతీ ఘాట్, నదీ ప్రాంతంలో నియమించారు.

వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేటి నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు ఆరోగ్యం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ పుష్కర శుభాకాంక్షలు తెలిపారు.

245 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు

సరస్వతీ అంత్య పుష్కరాలకు లక్షల వాహనాలు వస్తాయని అంచనా వేసి, వీటికిగాను 245 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ఏరియాలతో పాటు ఘాట్లు, దేవాలయం తదితర ప్రాంతాలలో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేశారు. ఈ 12 రోజులపాటు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకుగాను 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. పుష్కర ఘాట్లలో నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టారు.

100 మంది గజ ఈతగాళ్ల నియామకం

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా త్రివేణి సంగమంలో పుష్కర ఘాట్ల వద్ద 100 మంది గజ ఈతగాళ్లను నియమించారు. వీటితోపాటు సేఫ్టీ బోట్స్, లైఫ్ రింగ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీంలను నియమించారు. పుష్కర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు ఈఓ కార్యాలయంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు.

Leave a Reply