కాకినాడ: రూ. లక్ష లంచం తీసుకుంటూ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్పష్టమైన సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించి.. నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ కిశోర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. తునికి చెందిన ఆర్.రమేశ్ బాబు తన భార్య పేరిట ఉన్న సమత గ్యాస్ ఏజెన్సీని కొన్ని కారణాల వల్ల తన పేరు మీదకు మార్చాలని జిల్లా రిజిస్ట్రార్ ను ఆశ్రయించారు. అందుకు ఆయన రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆనందరావు నుంచి రూ. లక్ష, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి నుంచి రూ.25వేలు, అనధికారికంగా ఉన్న మరో రూ.80వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ వెలుగుల జగదీశ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.