AI Impact on Humans | ఏఐ ప్రభావంతో మారుతున్న మానవ ఆలోచనా విధానం

AI Impact on Humans | ఏఐ ప్రభావంతో మారుతున్న మానవ ఆలోచనా విధానం
AI Impact on Humans | స్మరణశక్తి, సృజనాత్మకతపై కృత్రిమ మేధ ప్రభావం
విద్యా వ్యవస్థలో పెరుగుతున్న ఏఐ వినియోగం
సహాయక సాధనంగా ఏఐ.. ప్రమాదమా? అవకాశమా?
పరిమిత వినియోగమే వ్యక్తిత్వ వికాసానికి మేలు
AI Impact on Humans | ఒకప్పుడు మనలో చాలా మందికి కనీసం ఏడెనిమిది ఫోన్ నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు కొంతమందికి తమ సొంత నంబర్ కూడా వెంటనే గుర్తుకు రావట్లేదు. కొన్నేళ్ళ క్రితం వరకు ఆటోడ్రైవర్లు నగరంలోని వీధులను మనసులోనే గుర్తుపెట్టుకునేవారు. ఇప్పుడు జి.పి.యస్. లేకుండా చిరపరిచితమైన ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా వెనుకాడుతున్నారు. ప్రస్తుతం రెండంకెల సంఖ్యలు నాల్గింటిని కూడిక చేయాలన్నా, మొబైల్‌లో ఉన్న కాలిక్యులేటరు పనిచెప్పాల్సిందే. ఈ మార్పులు ఒక్కసారిగా సంభవించలేదు. కాగితం లెక్కల నుండి కాలిక్యులేటర్‌కు, అక్కడి నుండి కంప్యూటర్‌కు, దాన్నుండి స్మార్ట్‌ఫోన్‌కు, ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) వైపు మనం వేగంగా ప్రయాణించాము. ఇప్పటివరకు వచ్చిన సాంకేతిక మార్పులు ప్రధానంగా మనిషి పనిని వేగవంతం చేశాయి. కానీ ఏఐ మాత్రం నేరుగా మనిషి ఆలోచనా సరళిలోకి జొరబడిపోతూ, అసలు ఆలోచించాల్సిన అవసరాన్నే క్రమంగా తగ్గించేస్తోంది.
ఉదాహరణకు, ఈ మధ్యకాలం వరకు ఒక కొత్త ప్రదేశం సింగపూర్ విహారయాత్రకు వెళ్ళదలిస్తే మనం ముందుగా తెలిసినవారిని, యాత్రా నిర్వాహకులను సంప్రదించటమో, గూగుల్, వికీపీడియాలో వెదకటమో చేసేవాళ్ళం. ఈ పని శ్రమతో కూడుకున్నదే. అయినప్పటికీ అందులో ఒక రకమైన సంతృప్తి ఉండేది. ఆప్తుల భాగస్వామ్యం, వారితో సంప్రదింపులు ఆహ్లాదకరంగా సాగేవి. ఈ ప్రయత్నంలో కొత్తవారితో పరిచయాలు ఏర్పడేవి. సమాచార వినిమయం జరిగేది. ఎన్నో విషయాలు యాత్రకు సంబంధించినవి, సంబంధం లేనివి మన మెదడు పొరల్లో నిక్షిప్తం అయ్యేవి, సందర్భం వచ్చినప్పుడు అవన్నీ అసంకల్పితంగానే మనకు అక్కరకు వచ్చేవి. సమాచారం సేకరించే ప్రక్రియ కూడా ఒక మానసిక వ్యాయామంలా పనిచేసేది.
ప్రస్తుతం చాలా మంది ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత ‘సింగపూర్‌కు ఆరు రోజుల విహారయాత్ర’ అని తెలుగులోనే చాట్ జి.పి.టి లాంటి ఏదో ఒక ఏఐ యాప్‌లో టైప్ చేస్తున్నారు. నోటి మాటగా చెప్పినా సరిపోతుంది. ఆ యాప్ అవసరమైన సమస్త వివరాలను అర్థమయ్యే భాషలో అందించడమే కాకుండా, ఎన్నో ప్రత్యామ్నాయాలు, యాత్రా నిర్వాహకుల సమాచారం.. ఇవన్నీ క్షణాల్లో ఇస్తుంది. సౌకర్యం ఉంది, కానీ ఈ వ్యవహారమంతా యాంత్రికంగా, నిస్తేజంగా సాగిపోతోంది. మెదడుకు తగిన మేత ఉండటం లేదు. ఏదైనా పరికరం, సామర్థ్యం సుదీర్ఘకాలం ఉపయోగించకపోతే, అది క్రమంగా క్షీణించిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతారు. మెదడు కూడా అందుకతీతం కాదు. పైగా, అది వాడినకొద్దీ ఉత్తేజితమవుతుంది.
మెదడును తగినంతగా ఉపయోగించకపోవడం మొదటగా మన స్మరణశక్తిపై కనిపిస్తోంది. ఫోన్ నంబర్లు, దారులు, స్పెల్లింగులు, తేదీలు అన్నీ యంత్రాలకే అప్పగించడంతో మెదడుకు వాటిని గుర్తుంచుకునే అవసరం తగ్గుతోంది. కానీ ఇది అక్కడితో ఆగిపోవడం లేదు. క్రమంగా స్వతంత్ర ఆలోచన, విశ్లేషణ, సృజనాత్మకత, సానుభూతి, ఆర్ద్రత వంటి మానవ మేధస్సు యొక్క మూలాలను, సహజ స్పందనలను కూడా మందగింపజేసే ప్రమాదం ఏర్పడుతోంది.
త్వరిత సమాధానాలకు అలవాటు పడుతున్న మనసు, ఓపికగా చదవడం, లోతుగా ఆలోచించడం వంటి అలవాట్లను క్రమంగా కోల్పోతుందా అన్న సందేహం ఏర్పడుతోంది. గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ కాగితం మీద రాసుకునే సంస్కృతి పెరిగితే మనుషులు జ్ఞాపకశక్తిని కోల్పోతారని ఏనాడో ఆందోళన వ్యక్తం చేశాడు. ఏఐ మరో మెట్టు ఎక్కింది, ఇది సమాచారం నిల్వ చేయడం మాత్రమే కాదు; మనిషి తరపున, మనిషిలా కొన్ని సందర్భాల్లో ఇంకా మెరుగ్గా ఆలోచించడం ప్రారంభించింది. కాబట్టి దీని ప్రభావం మరింత విస్తృత స్థాయిలో ఉంది.
అయితే, సాంకేతిక పరిణామాల చరిత్రలో ఇలాంటి భయాలు కొత్తవి కావు. ముద్రణాయంత్రం వచ్చినప్పుడు, కాలిక్యులేటర్ కనుగొన్నప్పుడు, కంప్యూటర్ ప్రవేశించినప్పుడు కూడా ఇలాంటి సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అవన్నీ ప్రధానంగా ఉద్యోగ లభ్యతపై యాంత్రీకరణ ప్రభావం వరకే పరిమితమయ్యాయి. ప్రస్తుత సమస్య వేరు. ఈనాటి ఆధునిక ప్రపంచానికి మూలాధారమైన మనిషి మేధాశక్తినే ఏఐ సవాలు చేస్తోంది.
ఇప్పటికే దీని ప్రభావం విద్యా వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులు ఇంటి పని, ప్రాజెక్ట్ నివేదికలు ఏఐతో రాయించుకునే సంస్కృతి మొదలైంది. ఫలితంగా అధ్యాపకులను, గ్రంథాలను, నిఘంటువులను సంప్రదించడం; స్వయంగా ప్రయోగాలు చేయడం.. ఇతర విద్యార్థులతో చర్చించడం గణనీయంగా తగ్గిపోతున్నాయి. మొత్తానికి పని పూర్తవుతుంది. కానీ, లక్ష్యం నెరవేరదు. ఆ నివేదికను ఇంటర్వ్యూలో మౌఖికంగా వివరించగలడా? అది ఏఐ డిటెక్షన్ పరీక్షకు నిలబడుతుందా? అటువంటి విద్యకు సార్థకత లభిస్తుందా? ఒక ఉద్యోగి ఏఐతో నివేదిక తయారు చేయవచ్చు.
కానీ సమావేశంలో ఆ నివేదికను సహేతుకంగా విశ్లేషించి, సమయానుకూలంగా స్పందించగలడా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. అయితే, ఈ నాణేనికి మరో వైపు కూడా ఉంది. ఏఐని పూర్తిగా ప్రతికూలంగా చూడకూడదు. ఇది సమాచారం సేకరించడం, ముసాయిదాలు తయారు చేయడం, కోడింగ్ సూచించడం వంటి పనుల్లో అద్భుతంగా సహాయపడుతోంది. తెలియని విషయాలు తెలుసుకోవడం, భాషా పరిజ్ఞానం పెంచుకోవడం కోసం నిఘంటువులా, వ్యాకరణ గ్రంథంలా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. స్టాన్ఫోర్డ్, ఎంఐటీ వంటి సంస్థల అధ్యయనాలు చెబుతున్నట్లు, ఏఐని సరైన ‘సహాయ సాధనం‘గా వాడుకుంటే మన సృజనాత్మకత మరింత పెరుగుతుంది.

భవిష్యత్తులో ఏఐని ఎంతవరకు, ఏ విధంగా, ఏ ఏ పనులకు ఉపయోగించుకుంటాడన్న దానిపైనే వ్యక్తిగత పురోగతి కూడా ఆధారపడే రోజులు ఎంతో దూరంలో లేవు. సాంకేతిక విద్యార్హతలను సముపార్జించుకునే విషయం ప్రక్కన పెడితే, దైనందిన జీవితంలో ఏఐ వాడకాన్ని చాకచక్యంగా, పరిమితంగా వాడుకోగలగటం వ్యక్తిత్వ వికాసం దృష్ట్యా అత్యావశ్యకం. తెలియని విషయాలు తెలుసుకోవడం, తెలిసిన దాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం ఏఐని సహాయక సాధనంలా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కావలసిన సమాచారం ఇచ్చి, నివేదికలు రూపొందించడంలో సహాయం తీసుకోవచ్చు.
దాన్ని ముసాయిదాగా తీసుకొని, స్వంతంగా మన అనుభవం, మన ఆలోచనలు, మన స్థానిక దృక్పథం, సంస్థ ఆశయాలు, దూరదృష్టి జోడించి నివేదిక రూపొందించుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీదైనా ముద్ర లేకపోతే, మీరు చేసే ఏ పనికైనా గుర్తింపు, విలువ పరిమితంగానే ఉంటాయి. పూర్తిగా ఏఐ నిర్మించిన ఏడంతస్తుల రాజభవనం కంటే, దాని సహాయంతో మీరు శ్రమకోర్చి కట్టుకున్న పొదరిల్లే మీకు తృప్తినిచ్చి, సమాజంలో మీ స్థానాన్ని పదిలపరుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఏఐని ఓ పాఠ్యగ్రంథంలా, గురువులా, స్నేహితుళ్ళా ఉపయోగించుకున్నంత వరకూ అది మనకు గణనీయమైన మేలు చేస్తుంది. పరీక్షల్లో కాపీ కొట్టేందుకు ‘స్లిప్పు‘లా వాడుకుంటే మాత్రం భవిష్యత్తు ప్రశ్నార్థకమైనట్లే.
బాలాజీ పల్లపోతు
99490 98406
