Rs-65K-Crores : పేదల సేవలో.. Andhra Prabhya Top Story

Rs-65K-Crores : పేదల సేవలో.. Andhra Prabhya Top Story
- కూటమి సూపర్
- పెన్షన్ల పంపిణీలో దేశంలో నెంబర్-1
- 2 ఏళ్ల పాలనలో రూ. 65 వేల కోట్లు
- ఐదేళ్లల్లో గత ప్రభుత్వం ఖర్చులో 71.5 శాతం ఈ 2 ఏళ్లల్లోనే
- రూ. 4000 నుంచి రూ. 15000 వరకు
- దివ్యాంగులకు రెండింతల లబ్ది
- ఏపీలో సామాజిక విప్లవం ఇది
- ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో సీఎం సీఎం
(ఆంధ్రప్రభ, అమరావతి )

సామాజిక పింఛన్ అంటే కేవలం రూ. 500లో, రూ. 1000 చేతిలో పెట్టే తూతూమంత్రపు ప్రక్రియ కాదు.. అది ఒక నిరుపేద కుటుంబానికి కొండంత అండ, ఆత్మగౌరవ ప్రతీక అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. సమాజంలోని అట్టడుగు వర్గాలు, వృద్ధులు, చేరదీసే దిక్కులేని అభాగ్యులు గౌరవప్రదమైన జీవనం సాగించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. 2 ఏళ్ల పాలనలో రికార్డు స్థాయిలో సుమారు రూ. 65 వేల కోట్లకు పైగా నిధులను లబ్దిదారులకు కూటమి ప్రభుత్వం పంపిణీ చేసింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ చేపట్టడం లేదు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో రూ. 91 వేల కోట్ల నిధులను పెన్షన్ల రూపంలో ఖర్చు పెడితే… అందులో 71.5 శాతం మేర నిధులను రెండేళ్ల కాలంలోనే కూటమి ప్రభుత్వం పంపిణీ చేపట్టింది. ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తున్నట్టే… సామాజిక భద్రతా పెన్షన్లను అందుకుంటున్న ఎన్టీఆర్ భరోసా లబ్దిదారులకు ఠంచనుగా పెన్షన్ డబ్బులను ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది. క్షేత్ర స్థాయిలో ఉండే స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలకు చెందిన సిబ్బంది ఉదయం 8-9 గంటల్లోనే సుమారు 75 నుంచి 80 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు. ఏదైనా నెలలో ఒకటో తేదీ ఆదివారం కానీ.. శెలవు దినం అయితే.. ముందు నెలలోని లాస్ట్ వర్కింగ్ డే రోజునే పెన్షన్ మొత్తాలను లబ్దిదారులకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నా… ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా జాప్యం చేయకుండా పెన్షన్ల పంపిణీని చేపట్టింది. అలాగే ముఖ్యమంత్రి ప్రతి నెలా క్రమం తప్పకుండా పేదల సేవలో పేరుతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
Rs-65K-Crores : పెన్షన్లల్లో ట్రెండ్ సెట్టర్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక రక్షణ కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు నేడు లక్షలాది మంది జీవితాల్లో సరికొత్త కాంతులు నింపుతున్నాయి. తొలి నుంచి తెలుగుదేశమే పెన్షన్ల విషయంలో ట్రెండ్ సెట్ చేసింది. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పెంపునకు, తెలుగుదేశం పార్టీ భావజాలానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారుల చేతికి అందే మొత్తాన్ని భారీగా పెంచుతూ వచ్చిన ఘనత ముమ్మాటికీ తెలుగుదేశం ప్రభుత్వాలదే. గత పాలనలో రూ. 1000 పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే… కూటమి ప్రభుత్వం వచ్చి రావడంతోనే రూ. 1000 పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. బాధ్యతలు స్వీకరించిన తక్షణమే వృద్ధులు, చేనేత, కల్లుగీత కార్మికులు, జానపద కళాకారులకు గతంలో ఉన్న రూ. 3 వేల పింఛన్‌ను రూ. 4 వేలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలలోనే, అంతకుముందు పెరిగిన మూడు నెలల బకాయిలను కలుపుకుని ఏకంగా రూ. 7 వేలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందించి మానవతా దృక్పథాన్ని చాటుకుంది కూటమి ప్రభుత్వం. ఇంతటి భారీ పెంపుదల దేశ సామాజిక సంక్షేమ చరిత్రలోనే అపూర్వమైన ఘట్టమనే చెప్పాలి.
Rs-65K-Crores : పేద కుటుంబాలకి పెద్ద దిక్కుగా

శాశ్వత వికలాంగులకు, మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేల పెన్షన్ కొండంత అండగా నిలుస్తోంది. శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగుల పట్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం చూపిన శ్రద్ధ చూపెడుతోందనే ప్రశంసలు కూటమి ప్రభుత్వానికి అందుతున్నాయి. దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని గతంలో ఉన్న రూ. 3 వేల నుంచి రెట్టింపు చేసి నెలకు రూ. 6 వేలకు పెంచడం ద్వారా వారి కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచింది. అదే విధంగా, కిడ్నీ, లివర్, హార్ట్ మార్పిడి చేయించుకుని నిరంతరం ఖరీదైన మందులపై ఆధారపడే దీర్ఘకాలిక రోగుల పింఛన్‌ను సైతం రూ. 5 వేల నుండి రూ. 10 వేలకు రెట్టింపు చేసి ప్రభుత్వం వారి ప్రాణాలకు భరోసా కల్పించింది.
Rs-65K-Crores : పెండింగ్ లేకుండా స్పౌజ్ పెన్షన్లు…
మరణించిన పెన్షనర్ జీవిత భాగస్వామికి రూ. 4 వేల వితంతు పింఛన్‌ను కొత్తగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇప్పటివరకు 2,14,113 మందికి కొత్తగా లబ్ధి చేకూర్చింది. ఇందుకోసం నెలకు సుమారు రూ. 85 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. అలాగే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా మూడు నెలలు వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోకున్నా… ఆ మొత్తాలను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కలిగిస్తోంది ప్రభుత్వం. దీని ద్వారా నవంబర్ 2024 నుండి మే 2026 వరకు 20.23 లక్షల మంది రూ. 1,712.92 కోట్ల బకాయిలను సులభంగా పొందగలిగారు. గత ప్రభుత్వ పాలనలో రకరకాల నిబంధనలు, రాజకీయ ఆంక్షల పేరుతో నిర్దాక్షిణ్యంగా పెన్షన్లల్లో ఎప్పటికప్పుడు కోతలు విధించేది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన 2.50 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసి లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం నింపారు. అంతేకాకుండా, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పింఛన్ స్థితిగతులు, ఫిర్యాదుల పరిష్కారానికి అత్యాధునిక డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి లబ్ధిదారుల మొబైల్‌కే నేరుగా సమాధానం పంపే పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నారు.
ALSO READ : Cbn Vision Plan : ఇక సాగర తీరం అభివృద్ధి Andhra Prabha Top News
