బోయినిపేట అంగన్‌వాడీ కేంద్రంలో నాసిరకం పోషకాహారం..

మంథని, ఆంధ్రప్రభ : మంథని పట్టణంలోని బోయినిపేట అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు కుళ్లిపోయిన గుడ్లు, గడువు ముగిసిన పాలు పంపిణీ చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన పోషకాహారంలో నాణ్యత లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కేంద్రంలో ఇటీవల పంపిణీ చేసిన గుడ్లు పాడై దుర్వాసన వస్తోందని, పాల ప్యాకెట్ల గడువు తేదీ ముగిసినా వాటిని పంపిణీ చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోషకాహారం పేరుతో నాసిరకం వస్తువులు పంపిణీ చేయడం బాధాకరమని, సంబంధిత అధికారులు వెంటనే కేంద్రాన్ని తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న గుడ్లు, పాలు మరియు ఇతర పోషకాహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.