బెజ్జంకిలో అకాల వర్షం ప్రభావం

బెజ్జంకిలో అకాల వర్షం ప్రభావం
మక్కలు, వరి తడిసిపోవడంతో రైతుల ఆగ్రహం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలంలో కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే దాదాపు 3000 బస్తాల మక్కలు సిద్ధంగా ఉన్న కొనుగోలు ప్రక్రియ జరగక మక్కలు, వరి పంటలు వర్షపు నీటిలో తడిసి తీవ్ర నష్టం మిగిల్చాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం జరుగుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రైతులు తమ పంటను మార్కెట్ యార్డ్‌కు తీసుకువచ్చినా, కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగకపోవడంతో బస్తాలు రోజుల తరబడి అలాగే పేరుకుపోతున్నాయి. వర్షం కారణంగా ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని, దీనివల్ల మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
