72,789quintals | ఖరీఫ్.. దిగులు

72,789quintals | ఖరీఫ్.. దిగులు
72,789quintals | సిద్ధం కాని విత్తనాలు
ఆలస్యంపై ఆందోళన
అడ్డొస్తున్న పాత బకాయిలు
విత్తుకు సన్నద్ధమవుతున్న రైతులు
72,789quintals | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఖరీఫ్ (వానాకాలం) సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండగా జిల్లాలో రైతుల్లో ఆందోళన నెలకొంది. మే నెల ముగింపు దశకు చేరుకోవడంతో జూన్ మొదటి వారంనుంచే వర్షాధార సాగు పనులు మొదలయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు కురవడం, వాతావరణం అనుకూలంగా మారుతుండటంతో రైతులు భూముల దున్నకం, ఎరువుల సేకరణ, విత్తనాల ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. అయితే ప్రధానంగా వేరుశనగ విత్తనాల సరఫరా ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌కు భారీ స్థాయిలో సాగు లక్ష్యాలు నిర్దేశించిన వ్యవసాయ శాఖ, విత్తనాల అవసరాన్ని కూడా అంచనా వేసింది. శ్రీ సత్యసాయి జిల్లాకు మాత్రమే 72,789 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు అన్ని రకాల పంటల విత్తనాలను కలిపి 1,26,916 క్వింటాళ్లు కేటాయించినట్లు సమాచారం. అందులో వేరుశనగ విత్తనాల వాటా అత్యధికంగా ఉంది. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాయితీ ధరలతో విత్తనాల పంపిణీకి ప్రణాళికలు రూపొందించినప్పటికీ, అమలులో మాత్రం జాప్యం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాయితీ ధరలతో పంపిణీ – రైతు వాటా 60 శాతం
ప్రభుత్వం ఈసారి కూడా టెండర్ల ద్వారా విత్తన వేరుశనగ ధరలను ఖరారు చేసి రైతులకు రాయితీపై అందించేందుకు చర్యలు చేపట్టింది. విత్తనాల పంపిణీలో రైతు వాటాగా 60 శాతం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. విత్తనాల సేకరణ, శుద్ధి, ప్రాసెసింగ్ తదితర పనులను నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 సబ్ ఏజెన్సీలను ఎంపిక చేశారు. అనంతపురం జిల్లాలో ఏడు, శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాసెసింగ్ యూనిట్లలో పనులు ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. దీంతో రైతుల్లో అనిశ్చితి నెలకొంది. “విత్తనాలు ఎప్పుడు సిద్ధమవుతాయి..? రైతు సేవా కేంద్రాలకు ఎప్పుడు చేరుతాయి..?” అనే ప్రశ్నలు రైతులను వేధిస్తున్నాయి.
పాత బకాయిలే ప్రధాన అడ్డంకి
విత్తనాల సరఫరాలో జాప్యానికి ప్రధాన కారణంగా పాత బకాయిల సమస్య నిలుస్తోందని తెలుస్తోంది. గత సీజన్లలో ప్రభుత్వం నుంచి రావాల్సిన చెల్లింపులు ఇంకా అందకపోవడంతో విత్తన సేకరణ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సమాచారం. సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, రవాణా వంటి ప్రక్రియలకు భారీగా నిధులు అవసరమవుతాయి. అయితే గత బకాయిలు క్లియర్ కాకపోవడంతో సంబంధిత ఏజెన్సీలు ముందడుగు వేయడంలో వెనుకంజ వేస్తున్నాయని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే సకాలంలో విత్తనాల పంపిణీ జరగకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో రైతులు తొలి వర్షానికే విత్తనాలు చల్లేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ విత్తనాల లభ్యత ఆలస్యమైతే సాగు సీజన్ దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి ఖరీఫ్ సీజన్‌లో సుమారు 13 లక్షల 30 వేల 662 ఎకరాల్లో వివిధ పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. అందులో వేరుశనగ సాగు ప్రధాన భాగం కానుంది. వర్షాధార వ్యవసాయం అధికంగా ఉండే రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ రైతుల జీవనాధార పంటగా కొనసాగుతోంది. గత రెండు మూడు సంవత్సరాలుగా వర్షాభావం, దిగుబడి సమస్యలు, ధరల అస్థిరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి అయినా సకాలంలో వర్షాలు కురిసి మంచి దిగుబడులు రావాలని ఆశిస్తున్నారు. అయితే విత్తనాల సరఫరాలో స్పష్టత లేకపోవడం రైతుల్లో నిరాశ కలిగిస్తోంది. ఇప్పటికే ఎరువులు, కూలీ చార్జీలు, సాగు ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో రైతులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.
ప్రాసెసింగ్‌కు సమయం – రైతుల్లో టెన్షన్
విత్తనాల ప్రాసెసింగ్ ప్రక్రియకు కనీసం వారం నుంచి పది రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని రైతు సేవా కేంద్రాలకు తరలించేందుకు మరో 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే జూన్ మొదటి వారం పూర్తయ్యే వరకు రైతులకు విత్తనాలు అందే పరిస్థితి కనిపించడం లేదని రైతు సంఘాలు అంటున్నాయి. అదేవిధంగా రైతులు విత్తనాలను శుద్ధి చేసి విత్తేందుకు సిద్ధం చేసుకోవడానికి కూడా కనీసం నాలుగు నుంచి ఐదు రోజులు అవసరం అవుతుంది. ఈ ఆలస్యాల కారణంగా జూన్ నెలలోనే సాగు పనులు పూర్తిచేయాల్సిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా విత్తనాలు వేస్తే దిగుబడిపై ప్రభావం పడటమే కాకుండా, తెగుళ్లు, ఎండల సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
వర్షాలపై కూడా అనిశ్చితి
ఇక వాతావరణ పరిస్థితులు కూడా రైతులను కలవరపెడుతున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినా అవి విస్తృతంగా లేవు. “వర్షం ఎప్పుడు పడుతుంది.. ఎంతవరకు పడుతుంది..?” అన్న అనిశ్చితి రైతుల్లో కనిపిస్తోంది. ఒకవైపు వర్షాల కోసం ఎదురుచూపులు, మరోవైపు విత్తనాల కొరత భయం రైతులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తోంది.
సరఫరాకు చర్యలు వేగవంతం
ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం విత్తనాల సరఫరాకు అవసరమైన చర్యలు వేగవంతం చేశామని చెబుతున్నారు. జిల్లాకు అవసరమైన విత్తనాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తామని, రైతులకు ఇబ్బందులు కలగకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేపడతామని పేర్కొంటున్నారు. అవసరమైన నిల్వలు సిద్ధం చేస్తున్నామని, వర్షాల పరిస్థితిని బట్టి సరఫరా ప్రణాళిక అమలు చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే రైతులు మాత్రం మాటలకంటే చేతల్లో ఫలితం కనిపించాలని కోరుతున్నారు. ఖరీఫ్ సీజన్‌కు సమయం చాలా తక్కువగా ఉండటంతో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని విత్తనాల సరఫరాను వేగవంతం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
