RCB vs SRH | ఆర్సీబీకి షాక్ ఇచ్చిన సన్ రైజర్స్!

లక్నో: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆర్సీబీపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ తో రాణించిన హైదరాబాద్ జట్టు, తర్వాత బౌలింగ్ లోనూ తన సత్తా చాటింది. దీంతో 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (32 బంతుల్లో 62), విరాట్ కోహ్లీ (25 బంతుల్లో 43) అద్భుతంగా ఆడ‌గా.. వారి తర్వాత వచ్చిన మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా బెంగళూరు జట్టు 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓట‌మితో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి జారిపోగా, పంజాబ్ కింగ్స్ రెండవ స్థానానికి చేరుకుంది.

హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు తీయగా.., ఇషాన్ మలింగ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక‌ జయదేవ్ ఉనద్కట్, హర్షల్ పటేల్, హర్ష్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి తలా ఒక వికెట్ తీశారు.

అంత‌కముందు, ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సన్ రైజర్స్ బ్యాటర్లు తమ స్థిరమైన ఆటతీరుతో రాణించారు. ఆర్సీబీ బౌలర్ల లూజ్ డెలివరీలను సమర్థవంతంగా వినియోగించుకున్న అభిషేక్ శర్మ (34), ట్రావిస్ హెడ్ (17) ఆరంభం నుంచే బంతిని దంచేశారు. అనంతరం ఇషాన్ కిషన్ ధాటిగా ఆడి, హెన్రిక్ క్లాసెన్ (24) , అనికేత్ వర్మల (28) తో కలిసి విజృంభించాడు. కిషన్ అద్భుతంగా ఆడి, 48 బంతుల్లో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Leave a Reply