ఏఐటీయూసీ మండల మహాసభను విజయవంతం చేయాలి

మునుగోడు, జూలై 7 (ఆంధ్రప్రభ): ఈ నెల 10న మునుగోడులో నిర్వహించనున్న ఏఐటీయూసీ 11వ మండల మహాసభను కార్మికులు, ప్రజలు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ, 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిన ఏఐటీయూసీ దేశంలోని తొలి కార్మిక సంఘమని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, 50 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని, గీత కార్మికుల మాదిరిగా భవన నిర్మాణ కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు దుబ్బ వెంకన్న, ప్రధాన కార్యదర్శి బెల్లం శివయ్య, ఇరిగి లింగస్వామి, దాం కాసిం, చందపాక యాదయ్య, బొల్లం రాములు, సిరగోని మారయ్య, కొమ్ము లక్ష్మయ్య, బొల్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు.