చిన్నారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యం.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
243 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ
మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల్లో 243 అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఇండక్షన్ స్టవ్‌లను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం పంపిణీ చేశారు. మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు స్టవ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పోషకాహారాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా తయారు చేసేందుకు ఇండక్షన్ స్టవ్‌లు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అందుకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ చిన్నారుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ప్రశంసించారు. కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పిల్లలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంతో వంట ప్రక్రియ వేగవంతమవడంతో పాటు ఇంధన వినియోగం తగ్గి, పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార తయారీ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఐసీడీఎస్ అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, కూటమి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
