మారెమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలకు సుఖశాంతులు కలగాలి

  • పుట్రేలలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే కొలికపూడి

విస్సన్నపేట, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో నిర్వహించిన శ్రీ మారెమ్మ తల్లి దేవస్థాన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట సంకల్పిత మహోత్సవ కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మారెమ్మ తల్లి దేవస్థానం స్థానిక ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రబిందువుగా నిలుస్తోందన్నారు. ఆలయాల అభివృద్ధి ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు పరిరక్షించబడతాయని పేర్కొన్నారు.

ఇలాంటి పునః ప్రతిష్ట మహోత్సవాలు గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయని అన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవం గ్రామానికి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకువస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ తెర్ల శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ విస్సన్నపేట మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు, యువ నాయకులు ఎన్‌ఆర్‌ఐ గిరి, జి.వి.ఆర్., కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.