రీడిజైన్ పేరుతో వేల కోట్ల వ్యయం పెంచారు: మంత్రి పొంగులేటి

అశ్వాపురం (ఆంధ్రప్రభ): గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ సాగర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో భారీ వ్యయం పెంచిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

అశ్వాపురంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ సాగర్ ప్రాజెక్టును రీడిజైన్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అదనపు భారం మోపిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చిత్తశుద్ధితో సీతారామ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఏ ప్రాజెక్టు రూపురేఖలను మార్చకుండా, ఖర్చును నియంత్రిస్తూ అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.