రాయలసీమకు లైఫ్లైన్ హంద్రీనీవా
- అదనపు జలాలే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ
- కూడేరు మండలం చోళసముద్రం వద్ద నిఘా
- ప్రెస్మీట్లో ప్రకటించిన అనంత వెంకటరామిరెడ్డి, శైలజానాథ్, విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ: కరువుకు నిలయంగా ఉన్న రాయలసీమకు హంద్రీనీవా ప్రాజెక్టు లైఫ్లైన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. రాయలసీమకు అదనపు జలాలే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటైందన్నారు.
గురువారం వైసీపీ జిల్లా కార్యాలయంలో అనంతతో పాటు మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను అన్ని జిల్లాల్లో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీలు అధ్యయనం చేసి అదనపు జలాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శరవేగంగా పనులు..
ఇందులో భాగంగా ఈనెల 19వ తేదీన కూడేరు మండలం చోళసముద్రం వద్ద హంద్రీనీవా పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి హంద్రీనీవా ద్వారా 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల జనాభాకు తాగునీరు అందాల్సి ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో హంద్రీనీవాకు రూపకల్పన చేశారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లో ఉరవకొండ వద్ద 40 టీఎంసీలకు శంకుస్థాపన చేశారన్నారు.
ఆ తర్వాత 1999లో ఆత్మకూరు వద్ద 5 టీఎంసీలకు కుదించిన విషయాన్ని గుర్తు చేశారు. 2004 వరకు హంద్రీనీవా పనులు ముందుకు సాగలేదని, వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 2005లో 5 టీఎంసీల జీవో రద్దు చేసి 40 టీఎంసీల సామర్థ్యంతో పనులు శరవేగంగా చేపట్టారని తెలిపారు. దాని ఫలితంగానే 2012లో కృష్ణా జలాలు హంద్రీనీవా ద్వారా జీడిపల్లికి వచ్చాయని అన్నారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం..
చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే నికర జలాలు లేకుండా మిగులు జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు వచ్చాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.3850 కోట్లతో పనులు చేశామని గొప్పలు చెబుతున్నారని, కానీ అనుకున్న మేరకు నీళ్లు రాలేదన్నారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీళ్లు తరలిస్తుండడం వల్ల సీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందన్నారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో హంద్రీనీవాను 6300 క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేసే పనులకు శ్రీకారం చుట్టి టెండర్లు కూడా పూర్తి చేశామన్నారు. ఆలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో మళ్లీ చంద్రబాబు 3850 క్యూసెక్కులకే హంద్రీనీవాను పరిమితం చేశారన్నారు. తక్కువ సమయంలోనే 51 టీఎంసీలు తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితి అలా లేదని తెలిపారు.
నిజంగా 3850 క్యూసెక్కులు వచ్చి ఉంటే 170 రోజుల్లోనే 51 టీఎంసీలు వస్తాయని, మరి 242 రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. పైగా హంద్రీనీవా ప్రధాన కాలువను కుదించి బ్రాంచ్ కెనాళ్లను పెంచడం గతంలో ఎక్కడా జరగలేదని తెలిపారు. హంద్రీనీవా లైనింగ్ పనుల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయినట్లు చెప్పారు. హంద్రీనీవా పనుల విషయంలో అంచనాలు పెరగడం తప్పితే ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదన్నారు. ఈ క్రమంలోనే ఈనెల 19వ తేదీన హంద్రీనీవా పనులను కూడేరు మండలం చోళసముద్రం వద్ద పరిశీలించనున్నట్లు చెప్పారు. ఇదే తరహాలో గ్రేటర్ రాయలసీమ వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల పరిశీలన ఉంటుందన్నారు.
మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ… తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకురావడం వల్లే రాయలసీమకు మేలు జరుగుతుందన్నారు. హంద్రీనీవా కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ జిల్లా శ్రేయస్సు గురించి ఆలోచించాలని కోరారు. గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టులు, రాయలసీమ లిఫ్ట్ కోసం టాస్క్ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ… సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు. ఆల్మట్టి, అప్పర్ భద్ర, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల కారణంగా రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. హంద్రీనీవా విషయంలో ఆదిలోనే గొంతునొక్కే ప్రయత్నాలను గతంలో చంద్రబాబు చేశారని, అందులో భాగంగానే 40 టీఎంసీల సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు కుదించారని గుర్తు చేశారు. హంద్రీనీవా నీళ్లు కుప్పంకు వెళ్లకపోతే అసలు ఈ ప్రాజెక్టు గురించే చంద్రబాబు ఆలోచన చేసేవారు కాదన్నారు. ఈనెల 19వ తేదీన చోళసముద్రం సమీపంలో హంద్రీనీవా కాలువను పరిశీలించి ఆ ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు.
