గూడూరులో చైన్ స్నాచింగ్ కలకలం

  • మహిళపై దాడి.. 35 గ్రాముల బంగారం అపహరణ
  • ప్రతిఘటించినా దుండగుడి దౌర్జన్యం
  • సీసీటీవీలో రికార్డైన దృశ్యం

కర్నూల్ రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఇంటి ముందు కళ్లాపు చల్లేందుకు వచ్చిన మహిళపై గుర్తుతెలియని దుండగుడు దాడి చేసి, ఆమె ప్రతిఘటించినప్పటికీ మెడలోని సుమారు 35 గ్రాముల బంగారు గొలుసును అపహరించి పరారయ్యాడు. ఈ ఘటన స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గూడూరు పట్టణంలోని గోట్ల వీధిలో స్థానికంగా నివాసముంటున్న పద్మావతి అనే మహిళ ఇంటి ముందు కళ్లాపు చల్లేందుకు బయటకు వచ్చింది. ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని ఆగంతకుడు ఆమెపై ఒక్కసారిగా దాడికి దిగాడు. పద్మావతి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొనే ప్రయత్నం చేయగా ఆమె ధైర్యంగా ప్రతిఘటించింది. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగింది.

ఈ క్రమంలో దుండగుడు ఆమెను కిందకు నెట్టివేసి, మెడలో ఉన్న దాదాపు 35 గ్రాముల బంగారు చైన్‌ను బలవంతంగా తెంచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెకు సహాయం చేశారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలో వరుసగా జరుగుతున్న చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో పోలీసులు రాత్రి, తెల్లవారుజామున గస్తీని మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.