Pollution | కాలుష్యం బారి నుండి కాపాడాలని వినతి
Pollution | కాలుష్యం బారి నుండి కాపాడాలని వినతి
Pollution | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ సమీపంలో ఉన్న హజాలో లాబరేటరీ, శ్రీ జయ లాబరేటరీ తదితర పరిశ్రమలు చేస్తున్న కాలుష్యం(Pollution)ను నివారించి తమ ఆరోగ్యాలను కాపాడాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ను కాలుష్య బాధిత రైతులు కలిసి వినతి పత్రం అందజేశారు. కాలుష్యం సమస్యను పరిష్కరించాలని తెలంగాణ శాసనమండలిలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినందుకుగాను ఎమ్మెల్సీ సత్యం కు బాధితులు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం గురించి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన నివేదికలను ఎమ్మెల్సీ కి అందజేసి పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం బారి నుండి గ్రామ ప్రజలను, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్సీ ని రైతులు వేడుకున్నారు. పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్ధ వాయువుల కారణంగా గ్రామ సమీపంలో పీల్చే గాలిలో బెంజిన్, టోలిన్, ఇథైల్ బెంజిన్(ethyl benzene) వంటి క్యాన్సర్ కారక రసాయనాలతో పాటు అనేక రకాల విషపూరిత వ్యర్ధాలు గాలిలో చేరినాయని, బోరు బావులలోని నీటిలో టీడీఎస్ విలువ 50 వేలకు పైగా చేరినదని, వ్యవసాయ భూములలోని మట్టిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ విలువ 16 వేల వరకు చేరినదని రుజువులను నివేదికల రూపంలో ఎమ్మెల్సీ కి అందజేశారు.

పరిశ్రమల కాలుష్యం కారణంగా గ్రామంలో ఉండలేక వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పరిశ్రమలు చేస్తున్న కాలుష్యం గురించి పిసిబి అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదని, పరిశ్రమల యాజమాన్యం తో అవగాహన కుదుర్చుకున్న పిసిబి ఉన్నతాధికారులు పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా కేవలం ఆదేశాలు మాత్రమే జారీ చేస్తూ అమలు పరచడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమలు చేసిన కాలుష్యాన్ని 2025 జూన్ మాసంలో సెంట్రల్ పిసిబి(central PCB) అధికారులు గుర్తించి, కాలుష్యాన్ని అరికట్టుటకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయానికి నివేదికలు పంపినప్పటికీ నేటి వరకు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఆ కారణంగా పరిశ్రమలు చేసే కాలుష్యంలో ఎటువంటి మార్పు లేకుండా ప్రతిరోజు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధ వాయువుల వాసనలను భరించలేకుండా ఉన్నందున పరిశ్రమలను గ్రామం నుండి తరలించాలని ఎమ్మెల్సీ ని గ్రామస్తులు కోరారు.
గ్రామ సమీపంలో కంటిన్యూస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేయించి గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమలు చేస్తున్న కాలుష్యాన్ని నిరంతరం గుర్తించుటకు తగిన చర్యలు చేపట్టాలని బాధిత రైతులు గుమ్మి దామోదర్ రెడ్డి, వస్పరి నరసింహ, వస్పరి రేణుక- లింగయ్య, వస్పరి తరుణ్, సురకంటి కృపానందరెడ్డి తదితరులు ఎమ్మెల్సీ సత్యం ను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, పల్లె శేఖర్ రెడ్డి, పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు పగిళ్ల మోహన్ రెడ్డి, నాయకులు దుబ్బాక భాస్కర్, బత్తుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
