నేషనల్ ఇమ్యునైజేషన్ డే అవగాహన కార్యక్రమం…

నేషనల్ ఇమ్యునైజేషన్ డే అవగాహన కార్యక్రమం…

టీకాలతో పిల్లలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించాలి..

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులోని మెడికవర్ ఆసుపత్రిలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్య రక్షణలో టీకాల ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు వైద్యులు వివరించారు. కార్యక్రమంలో కన్సల్టెంట్ శిశురోగ నిపుణురాలు, నవజాత శిశు నిపుణురాలు డాక్టర్ కె. సింధూరా రెడ్డి మాట్లాడుతూ పుట్టిన వెంటనే ప్రారంభమయ్యే టీకాల షెడ్యూల్‌ను ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

టీకాలు పిల్లలను పోలియో, మీజిల్స్, డిఫ్తీరియా, హెపటైటిస్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సమయానికి టీకాలు వేయించడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ మరియు పిల్లల ఆస్త్మా, అలర్జీ నిపుణుడు డాక్టర్ వై. గణేష్ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో వచ్చే అనేక సంక్రమణ వ్యాధులను టీకాల ద్వారా ముందుగానే నివారించవచ్చని చెప్పారు.

టీకాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తల్లిదండ్రులు వైద్యుల సూచనల మేరకు పూర్తి టీకాల కార్యక్రమాన్ని పాటించడం అవసరమని సూచించారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య రక్షణలో టీకాలు అత్యంత కీలకమని అన్నారు. సమయానికి టీకాలు వేయించడం ద్వారా అనేక ప్రమాదకర వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

ప్రజల్లో టీకాలపై అవగాహన పెంచడం ఆరోగ్య సేవల్లో ముఖ్య భాగమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మెడికవర్ ఆసుపత్రి నిరంతరం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొని టీకాల ప్రాముఖ్యతపై అవగాహన పొందారు.

Leave a Reply