క్విట్‌ ఇండియా స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి

కార్పొరేట్‌–మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

నాంపల్లి, ఆంధ్రప్రభ : నాడు బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేడు కార్పొరేట్‌ పెట్టుబడిదారులు, మతోన్మాద శక్తుల విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి పిలుపునిచ్చారు.

నాంపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా జైల్‌ భరో కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసనగా రాస్తారోకో చేపట్టారు.

అంబేద్కర్‌ చౌరస్తాలో సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌ల అమలుకు తుది నిబంధనలను ప్రకటించడంతో పాటు విద్యుత్‌ సవరణ బిల్లు–2025, విత్తన చట్టానికి సవరణలు వంటి చర్యలకు పూనుకుంటోందని విమర్శించారు.

కార్మికుల శ్రమను మరింతగా దోచుకునేందుకు పని దినాలను పెంచుతూ, రోజువారీ పని సమయాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుకునేలా యాజమాన్యాలకు స్వేచ్ఛ ఇవ్వడం సరికాదన్నారు.

కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని, సమ్మె హక్కు, కార్మిక సంఘాల హక్కులు, ఉద్యోగ భద్రత వంటి హక్కులను లేబర్‌ కోడ్‌ల ద్వారా కాలరాస్తున్నారని అన్నారు. కార్మిక సంఘాల గుర్తింపు, నమోదు విషయంలో కఠిన ఆంక్షలు విధించడం ద్వారా సంఘటిత పోరాటాలను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.

లేబర్‌ కోడ్‌లు అమలైతే తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కార్మికవర్గం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, సంక్షేమ బోర్డులపై కోతలు, ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు.

అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, ఐకేపీ, వీఏఓలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఆరోగ్యశాఖలోని వివిధ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ప్రజలు ఉపాధి హామీ పనులపై ఆధారపడుతున్నారని, అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాల వల్ల ఉపాధి హామీ పథకం నీరుగారిపోతోందని అన్నారు. ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించి గ్రామీణ పేదలకు సంవత్సరానికి కనీసం 200 రోజుల పని కల్పించాలని డిమాండ్‌ చేశారు.

సీఐటీయూ మండల కన్వీనర్‌ ఏదుళ్ల సునీత మాట్లాడుతూ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

రైతులకు పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధానాలను విడనాడి రైతు, కార్మిక, వ్యవసాయ కూలీల హక్కులను కాపాడే విధానాలను పాలకులు అవలంబించాలని కోరారు.

ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని ఏదుళ్ల సునీత పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కో కన్వీనర్‌ రేవల్లి యాదయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము లక్ష్మయ్య, గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అబ్బనబోయిన వెంకటయ్య, లక్ష్మణ్‌, గణేష్‌, కృష్ణయ్య, అరుణ, సులోచన, రావులమ్మ, పెయింటింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఒట్టి కోటి వెంకటయ్య, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యురాలు కోరె లలిత, కవిత, అరుణ, అలివేలు, రైతు సంఘం నాయకులు కాశయ్య, యాదయ్య, రాములు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఈశ్వరయ్య, జయప్రద తదితరులు పాల్గొన్నారు.